కొత్త ఇసుక విధానం ముసుగులో ఓ ప్రైవేటు సంస్థకు ఇసుక తవ్వుకునేందుకు వైకాపా ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ప్రజలను మరోసారి మోసం చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
మూడు భాగాలుగా విభజించిన టెండరు ప్రక్రియలో అనేక సందేహాలున్నాయి. జేపీ పవర్‌ను ఏ విధంగా ఎంపిక చేశారు? టెండరు ప్రక్రియను ఎలా పూర్తి చేశారు? తదితర అంశాలతో వెంటనే ప్రభుత్వం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడాదికో కొత్త విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం సామాన్యుడి సొంతింటి కలను దూరం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ పేరుతో మూడు ప్యాకేజీల ద్వారా ఇసుకను జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు ధారాదత్తం చేయడం దారుణం. దీనిని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రస్తుతం విశాఖలో భవన నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ తక్కువకే టెండర్ అప్పగించడంపై అనుమానాలు వస్తున్నాయి. కొందరు నాయకులు ఇసుకను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు ఇసుకను తరలించుకుపోయారు. ఇసుక విధానాలు ప్రభుత్వ గందరగోళ పనితీరుకు అద్దం పడుతున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక సరఫరా నిలిపివేసి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నేతృత్వంలో ఇసుక కృత్రిమ కొరతపై పోరాటం చేశాం- నాదెండ్ల మనోహర్
ప్రైవేటు సంస్థ ఎలా చేస్తుంది..
గడిచిన రెండేళ్లలో గత ప్రభుత్వ తప్పిదాలను సరి చేస్తామంటూ టోల్‌ఫ్రీ నంబర్లు, ఆన్‌లైన్ పోర్టళ్లు, ఇసుక స్టాక్ పాయింట్లు అంటూ ప్రజలకు చెప్పి ఇప్పుడు ప్రైవేటు కంపెనీ చేతుల్లో పెట్టడం సమంజసం కాదని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, 151 మంది ఎమ్మెల్యేలు కలిసి చేయలేనిది ఒక ప్రైవేటు సంస్థ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ‘కేంద్ర సంస్థతో ఇసుక సరఫరా చేస్తామని చెప్పి.. ఇప్పుడు మోసం చేసి జగన్‌రెడ్డికి పరిచయం ఉన్న వ్యక్తులకు తవ్వుకునే అవకాశం ఇచ్చారు. గతంలో రూ. వెయ్యికి ట్రాక్టర్ ఇసుక దొరికేది. ఇప్పుడు ఆ పరిస్థితి తీసుకురావాలి. ఇసుక విధానం కచ్చితంగా సామాన్యుడికి ఉపయోగపడేలా ఉండాలి. దానిని ఓ దోపిడీ కార్యక్రమంగా కాకుండా చూడాలి. నిర్మాణ రంగంలో పెట్టుబడులు వచ్చేలా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను, దానిపై ఆధారపడి జీవిస్తున్న 80 లక్షల మందిని ప్రభుత్వం ఆదుకోవాలి’ అని ఆయన డిమాండు చేశారు.
సంబంధిత కథనం: