తనపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు, వాటిని విలేకర్ల సమావేశంలో వెల్లడించడం, సాక్షి పత్రిక, టీవీలో చూపడం ద్వారా తన పరువుకు భంగం కలిగించారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. పలువురికి లీగల్ నోటీసు పంపారు. ‘వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి 2019 మార్చి 25న కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో నా క్లయింట్‌పై నిరాధార, అభ్యంతరక ఆరోపణలు చేశారు. అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తో పాటు, నిఘా విభాగాధిపతిగా ఉన్న నా క్లయింట్ తెదేపా కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. నా క్లయింట్ తన విధి నిర్వహణకంటే ఎన్నికల్లో డబ్బు పంపిణీకి, ఎన్నికల వ్యూహాల అమలుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు ఆయన ప్రతిష్ఠకు, గౌరవానికి తీవ్ర భంగం కలిగించాయి. ఆయన తన విధుల్ని స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించకుండా అడ్డుకునేందుకే అలాంటి నిరాధార ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదును మీడియాకీ విడుదల చేశారు.
విలేకర్ల సమావేశంలోనూ మాట్లాడి దాన్ని సాక్షి పత్రికలో ప్రచురించడంతో పాటు, సాక్షి టీవీలో పదే పదే ప్రసారం చేశారు. ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన 32 మంది పోలీసు అధికారులకు ఇంటెలిజెన్స్, శాంతిభద్రతల విభాగాల్లో కీలకమైన పోస్టింగ్‌లు ఇప్పించినట్టుగా ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో విజయసాయిరెడ్డి మరో నిరాధార ఆరోపణ చేశారు’ అని ఆ నోటీసులో ఏబీ తరఫు న్యాయవాది సాయిమోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పూర్వ ఎండీ, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఛానల్ (ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సీఈవో వినయ్ మహేశ్వరి, మేనేజింగ్ ఎడిటర్ ప్రియదర్శిని రామ్), సాక్షి ఎడిటర్ వి.మురళి, అప్పటి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్, ప్రచురణకర్త కె.రామచంద్రమూర్తిలకు జులై 17న లీగల్ నోటీసు పంపించారు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే అందరిపైనా ప్రాసిక్యూషన్‌కు చర్యలు చేపట్టడంతోపాటు, కోటి రూపాయలకు పరువునష్టం దావా వేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి
Vishaka Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోం: ఎంపీ విజయసాయి