కడప జిల్లా కందిమల్లయ్యపల్లి గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి నియామకాన్ని రెండు నెలల్లో పరిష్కరించాలని ధార్మిక పరిషత్ ను హైకోర్టు ఆదేశించింది. ధార్మిక పరిషత్ సభ్యులుగా దేవదాయ మంత్రి, కమిషనర్, తితిదే ఈవో ఉండాలని స్పష్టం చేసింది. నియామక నిర్ణయానికి ముందు సంబంధిత వ్యక్తులు వాదనలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.
మఠాధిపతులుగా తమను విధులు నిర్వహించనీయకుండా దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల అమలును సవాలు చేస్తూ ఇటీవల కన్ను మూసిన మతాధిపతి శ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి రెండో భార్య ఎన్.మారుతి మహాలక్ష్మి, ఆమె కుమారుడు ఎన్.గోవిందస్వామి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి .. ధార్మిక పరిషత్ తీర్మానం, దేవాదాయ శాఖ అధికారులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ధార్మిక పరిషత్ తీర్మానంలో తితిదే ఈవో సంతకం లేదని ఆక్షేపించింది. మఠాధిపతులుగా తమను గుర్తించాలన్న అభ్యర్థనను సింగిల్ బడ్జి పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంటూ మారుతి మహాలక్ష్మి, ఆమె కుమారుడు ఎన్.గోవిందస్వామి ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ మేరకు అప్పీల్ పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
ఇదీ చదవండి:
బ్రహ్మంగారి మఠం: పీఠాధిపతి వ్యాజ్యం విచారణ సోమవారానికి వాయిదా