సాయి గోలె... ఐఐటీ-మద్రాస్‌లో చదువుకుంది. అక్కడ ‘సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ల్యాబ్’లో విద్యార్థులు అంకుర సంస్థను ప్రారంభించవచ్ఛు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది సాయి. సాంకేతిక సాయంతో వ్యవసాయ రంగంలోని సమస్యల్ని పరిష్కరించాలనుకుంది. సహ విద్యార్థి సిద్ధార్థ్‌తో తన ఆలోచన పంచుకుంది. అతడికి వ్యవసాయమంటే ఆసక్తే. దాంతో ‘లీన్ అగ్రి’ను మొదలుపెట్టారు. దీనిద్వారా భూసార పరీక్షలు జరిపి ఏ నేల ఏ పంటకు అనుకూలమో చెప్పాలనేది వారి ఆలోచన. తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికై ఐటీ సంస్థలో ఉద్యోగాలు చేశారు. కానీ సంతృప్తి లేదనిపించి ఏడాదికే ఉద్యోగాలు వదిలేసి... తిరిగి తమ అంకుర సంస్థ మీద పనిచేయాలనుకున్నారు. అందుకోసం రైతులుగా మారి పుణెకు సమీపంలోని సాయి కుటుంబానికి చెందిన పొలంలో సాగు చేయడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల రైతుల్నీ పరిశీలించారు. పంటపంటకీ సాగు విధానం మారుతుంది. సమస్యలూ వేరుగా ఉంటాయి. ఇవన్నీ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాక ఈసారి వాటిని సమగ్రంగా పరిష్కరించే ప్రయత్నం మొదలుపెట్టారు. సంస్థకు ‘భారత్ అగ్రి’గా పేరు మార్చి పుణె కేంద్రంగా 2017లో ప్రారంభించారు. ఆ ఏడాది ‘ఉబర్ పిచ్’ పోటీల్లో వీరి సంస్థ రూ.35 లక్షల బహుమతి గెల్చుకుంది.
సాధారణంగా సాగులో 11 రకాల పోషకాల అవసరం ఉంటుంది. భూసార పరీక్షల్ని చేసి 30 రకాల అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఏ పోషకాల్ని ఏ మోతాదులో వేయాలో భారత్ అగ్రి రైతులకు సూచిస్తుంది. ప్రతీ పంటకీ ముందు భూసార పరీక్షతోపాటు, భూగర్భ నీటినీ పరీక్షిస్తున్నారు. వరి, గోధుమ, పత్తి, ఉల్లి, మిరప, చెరకు, పసుపుతోపాటు టొమాటో, క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి కూరగాయల సాగుకు వీరు సేవలు అందిస్తారు. నేలనీ, నీటినీ పరీక్షించాక ఏ పంట వేయాలి, ఎప్పుడు నీరు పెట్టాలి, ఎప్పుడు ఎరువులు వెయ్యాలి... మొదలైన అంశాల్లో సూచనలు ఇస్తారు. రైతులకు ఎస్సెమ్మెస్ రూపంలో, వాయిస్ మెసేజ్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్... ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం ఇస్తారు. వీరు సూచించిన పద్ధతుల్లో సాగుచేయడంవల్ల పెట్టుబడి ఎకరాకు పదివేలకు పైనే తగ్గిందనీ, దిగుబడి ఎన్నో రెట్లు పెరిగిందనీ చెబుతారు రైతులు.
యాప్ సాయంతో సేవలు...
గతేడాది జులైలో యాప్‌నీ తీసుకొచ్చింది భారత్ అగ్రి. ఇది అయిదు భాషల్లో అందుబాటులో ఉంటుంది. యాప్ వచ్చాక వాతావరణ పరిస్థితుల్నీ క్రోడీకరించి సమాచారం అందిస్తున్నారు. విత్తనాలు నాటింది మొదలు పంట చేతికొచ్చే వరకూ ప్రతి దశనీ గమనిస్తూ రియల్ టైమ్ అప్‌డేట్స్ ఇస్తారు. చీడపీడల ఫొటోల్ని రైతులు యాప్‌లో అప్‌లోడ్ చేస్తే వాడాల్సిన మందుల సమాచారాన్ని ఇస్తారు. ఈ యాప్‌ను లక్షమందికిపైగా రైతులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఓ పక్క సాగులో సాయపడుతూనే బ్యాంకులూ, బీమా సంస్థలూ, విత్తన సంస్థలూ, పంట కొనుగోలుదారుల్ని రైతులతో అనుసంధానిస్తున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రైతులు వీరి సేవలు పొందుతున్నారు. ఇప్పటివరకూ వివిధ సంస్థల నుంచి రూ.4.5కోట్లు పెట్టుబడి పొందారు. మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టుల ద్వారా అయిదేళ్లపాటు వెయ్యిమంది రైతులతో పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ‘మీ వ్యాపార ప్రయాణంలో తొందరగా తప్పులుచేయండి. ఆ అనుభవం నుంచి పాఠాల్ని నేర్చుకుని త్వరత్వరగా ముందుకు వెళ్లండి’ అని చెబుతుంది సాయి.