‘పోలీసు ఫిర్యాదుల అథారిటీ (పీసీఏ)’ ఛైర్మన్ పదవికి 65 ఏళ్ల వయసు కన్నా తక్కువ ఉన్న వారు అర్హులు.. అయినా 85 ఏళ్ల జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగిస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఇన్నాళ్లు మీతో ఉన్నారనే ఆయనకు ఆ పదవి ఇచ్చారని తెలుస్తోంది. కానీ, న్యాయపరమైన చిక్కుల్లోకి సంస్థలను మళ్లీ నెట్టకుండా వివేచనతో వ్యవహరించండి అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సూచిస్తూ గురువారం ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు. లేఖలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
‘‘పోలీసులపై వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఉండాలని 1979 నుంచి పలు కమిటీలు స్పష్టం చేస్తూ వచ్చాయి. పోలీసు వ్యవస్థ పనితీరు మెరుగుపర్చేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే 7 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికీ వివిధ సందర్భాల్లో ఆదేశాలు ఇచ్చింది. వాటిలో ఓ ఆదేశమే అన్ని రాష్ట్రాల్లో పోలీసు ఫిర్యాదుల అథారిటీలను ఏర్పాటు చేయడం. ఈ నేపథ్యంలోనే విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.కనగరాజ్‌ను పీసీఏ ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. ఇప్పుడది ఆందోళన కలిగిస్తోంది. పీసీఏ ఛైర్మన్ స్థానంలోకి వచ్చే వ్యక్తి ఆ పదవి స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏది ముందు అయితే ఆ పదవీ కాలం వర్తిస్తుందని నిబంధనల్లో పేర్కొన్నారు. అంటే 65 ఏళ్ల కన్నా తక్కువ వయసు వారు మాత్రమే ఆ పదవికి అర్హులు. అయితే జస్టిస్ వి.కనగరాజ్‌ను ఈ పోస్టులో నియమించేందుకు వీలుగా ఈ అంశానికి అడ్డుగా ఉన్న నిబంధన 4 (ఏ)ను సవరించారు. పరిమిత వయస్సును ఎప్పుడో దాటేసిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌ను ఈ స్థానంలో నియమించాలని ప్రణాళిక ప్రకారమే ఈ సడలింపు చేశారనేది నిర్వివాదాంశం. జస్టిస్ కనగరాజ్‌ను 2020 ఏప్రిల్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించగా నెలలోపే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. ఆ స్థానంలో మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను నియమించిన విషయం మీకు గుర్తు ఉండే ఉంటుంది. అప్పటి నుంచి జస్టిస్ కనగరాజ్ మీతో, మీ బృందంలో కలిసి ఉన్నాడనే విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకునే మీరు ఆయనకు ఈ పదవి ఇచ్చి పునరావాసం కల్పించారు.
చట్టబద్ధమైన పోస్టు తగదు..
జస్టిస్ కనగరాజ్ 85 ఏళ్ల వయసులో తన భుజస్కంధాలపై ఇంత బరువు బాధ్యతలు మోయగలరని ఎవరూ అనుకోలేరు. అదీ ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్రమైన ఆక్షేపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆ ఫిర్యాదులన్నింటినీ పరిశీలించి, ఫిర్యాదుదారులకు తగిన న్యాయం చేస్తారని ఊహించడం కష్టమే. వయో పరిమితి దాటి 20 ఏళ్లు అయిన వ్యక్తిని నియమించడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఇంతమేర వయో పరిమితి పెంపునకు శాసనసభ ఆమోదమైనా ఉండాలి లేదా ఆర్డినెన్సు ద్వారా అయినా జరగాలి. ఆయనలో అత్యద్భుతమైన న్యాయశాస్త్ర ప్రతిభ ఉందని భావిస్తే మీ న్యాయ సలహాదారుగా నియమించుకోవచ్చు. అంతే తప్ప ఇలాంటి చట్టబద్ధమైన పోస్టులో నియమించడం తగని పని.
చౌకబారు పనులు వద్దు..
పీసీఏలు ప్రస్తుతం కోరల్లేని పాముల్లా ఉంటున్నాయనేది ప్రజాభిప్రాయం. చాలా సందర్భాల్లో న్యాయం జరగడంలో జాప్యం కారణంగా ప్రజలకు ఇలాంటి వ్యవస్థలపైనే నమ్మకం పోతుంది. అందువల్ల మీరు ఇలాంటి చౌకబారు పనులకు దిగకుండా, మళ్లీ న్యాయపరమైన చిక్కుల్లోకి సంస్థలను నెట్టకుండా ఇప్పటికైనా వివేచనతో చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. ఇలాంటి అసంబద్ధమైన నిర్ణయాలను, మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులు సవాల్ చేసే వీల్లేకుండా తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కేంద్రమంత్రిని కలిసిన బుగ్గన.. రాష్ట్రానికి రేషన్ పెంచాలని వినతి