High Court News: మూడు నెలల చిన్నారిని ఆరుసార్లు విక్రయించి సొమ్ము చేసుకున్న వైనంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. ఈ విషయాన్ని సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, మహిళా శిశు, సంక్షేమశాఖ కార్యదర్శి, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్, సీబీఐ డైరెక్టర్, ఏపీ సీఎస్, డీజీపీలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ నెల 6న పిల్‌పై హైకోర్టు విచారణ జరపనుంది.
మంగళగిరి గండాలయపేటకు చెందిన మెడబలిమి మనోజ్ తన మూడు నెలల కుమార్తెను రూ.70వేలకు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కొండప్రోలుకు చెందిన మెగావత్ గాయత్రికి విక్రయించాడు. ఇందుకు మంగళగిరికి చెందిన మిక్కిలి నాగలక్ష్మి దళారీగా వ్యవహరించింది. ఆ తర్వాత శిశువును నల్గొండ జిల్లా పలకేడుకు చెందిన భూక్యా నందుకు రూ.1.20 లక్షలకు విక్రయించారు. మరోసారి ఆ చిన్నారిని హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన షేక్ నూర్జహాన్‌కు రూ.1.87 లక్షలకు విక్రయించారు. నూర్జహాన్ ఆ చిన్నారిని ఖమ్మం నగరానికి చెందిన అనుబోజు కిరణ్, హైదరాబాద్‌కు చెందిన బొమ్మాడ ఉమాదేవితో కలిసి విజయవాడకు చెందిన పడాల శ్రావణికి రూ.2 లక్షలకు విక్రయించారు. అనంతరం విజయవాడ గొల్లపూడికి చెందిన గరికముక్క విజయలక్ష్మికి రూ.2.20 లక్షలకు అమ్మారు. చివరిగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వర్రె రమేశ్ ఆ శిశువును రూ.2.50 లక్షలకు కొన్నారు. ఈ దశలో చిన్నారి తల్లి ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది.
విపరీతంగా మానవ అక్రమ రవాణా
పత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ జి.రామకృష్ణప్రసాద్‌తో కూడిన ధర్మాసనం అదే రోజు విచారణ జరిపింది. ‘మానవ అక్రమ రవాణా.. ముఖ్యంగా చిన్నపిల్లల విక్రయం దేశవ్యాప్తంగా విపరీతంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటివి ఉన్నాయి. ప్రస్తుత కేసులో శిశువును తిరిగి తీసుకురావడంతో ముగియలేదు. చిన్నారిని చివరిసారిగా కొన్న వ్యక్తి దళారీనా.. కాదా అనేది తేల్చాలి. మానవ అక్రమ రవాణా వ్యవహారంపై సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యం నమోదు చేసేందుకు సీజే ఆమోదం తర్వాత చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. పిల్‌గా మలచాలని సీజే స్పష్టం చేయడంతో రిజిస్ట్రీ ఆ మేరకు చర్యలు తీసుకుంది.
కారణాలపై అధ్యయనం చేయాలి: మూడు నెలల చిన్నారిని ఆరుసార్లు విక్రయించిన ఘటనపై ఛైర్మన్ జస్టిస్ విజయలక్ష్మి నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన హైకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ స్పందించింది. ఈ ఘటనకు కారణమైన అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశించింది.