విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నితో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ ఇటీవల ఈమేరకు ఉత్తర్వులనిచ్చారు. విచారణను జూన్ 15కు వాయిదా వేశారు.
రాజ్యాంగం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ స్వతంత్రంగా ఉండే వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం కమిషనర్‌గా రాజ్యాంగబద్ధ పదవి చేపట్టేందుకు పదవీ విరమణ తర్వాత కనీసం మూడేళ్ల గడువు ఉండాలని వ్యాజ్యంలో ప్రస్తావించారు. అధికరణ 243 కే ప్రకారం నీలం సాహ్ని నియామకం జరగలేదని పేర్కొన్నారు. ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేయకముందే ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా ప్రభుత్వం నియమించిందని వివరించారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 28న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ జీవో ఇచ్చారని పేర్కొన్నారు.
ఇదీచదవండి