గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం మహిళా పోలీసులుగా పరిగణించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అక్రమాలు చోటుచేసుకుంటే ఎవరో వచ్చి కోర్టు తలుపుతట్టే వరకు కళ్లు మూసుకొని ఉంటామనుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే జోక్యం చేసుకుంటామని తేల్చిచెప్పింది. మహిళా సంరక్షణ కార్యదర్శుల నియామకం సమయంలో దేహ దారుఢ్య పరీక్షలు లేవని గుర్తు చేసింది. తాజాగా జీవోలిస్తూ మహిళా కార్యదర్శులను పోలీసులుగా పరిగణిస్తూ దేహదారుఢ్య నిబంధనలు పెట్టడాన్ని ఆక్షేపించింది. ప్రజాధనాన్ని వృథా చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఒక సందర్భంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవసరమైన పనులకు నిధులివ్వడం లేదని పేర్కొంది. మహిళా సంరక్షణ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన రికార్డులు, సర్వీసు నిబంధనలు, నోట్ ఫైళ్లు, సంబంధిత జీవోలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
మహిళా సంరక్షణ కార్యదర్శులను కానిస్టేబుళ్లుగా పరిగణిస్తూ జనవరి 12న ప్రభుత్వం జారీచేసిన జీవో 1, 2లను సవాలు చేస్తూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. మరోవైపు ఇవే జీవోలను సవాలు చేస్తూ మహిళా సంరక్షణ కార్యదర్శులు పలువురు వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం విచారణలో ప్రభుత్వ న్యాయవాది వివేకానంద వాదనలు వినిపిస్తూ.. ‘పోలీసు విధులను మహిళా సంరక్షణ కార్యదర్శులు నిర్వహించరు. పోలీసు శాఖతో వారికి సంబంధం లేదు. పేరు మాత్రమే మహిళా పోలీసుగా ఉంటుంది. గతంలో ఇచ్చిన జీవో లోపాలను సరిదిద్దుకొని తాజాగా జీవోలిచ్చాం. పిటిషనర్లు విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నా మహిళా పోలీసుగా పిలవడం, ఖాకీ దుస్తులు ధరించడంపై అభ్యంతరం చెబుతున్నారు. తాజా ఉత్తర్వులతో మహిళా పోలీసులుగా పరిగణించే వారి విషయంలో అర్హతలను నిర్ణయించాం. నామమాత్రపు దేహదారుఢ్య అర్హతలను పేర్కొన్నాం. ఈ ఉత్తర్వులపై ఎవరికి అభ్యంతరం లేదు’ అని అన్నారు. ఈ వాదనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ.. కోర్టుకు అభ్యంతరం ఉందని పేర్కొంది. కార్యదర్శుల నియామకం సమయంలో దేహదారుఢ్య పరీక్షలు లేవని, ఇప్పుడు ఈ నిబంధనలేమిటని నిలదీసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది బాలాజీ వడేరా, నర్రా శ్రీనివాసరావు స్పందిస్తూ.. మహిళా సంరక్షణ కార్యదర్శులు పోలీసు దుస్తులు వేసుకోవడం నేరమని అన్నారు. పోలీసు డ్రెస్ వేసుకోవాలని కార్యదర్శులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, డ్రెస్‌ల కోసం రూ.కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని వివరించారు. ప్రజాధనాన్ని వృథా చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవసరమైన పనులకు నిధులివ్వడం లేదని పేర్కొంది. పోలీసు దుస్తులు ధరించలేదని ఎవరిపైన అయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తమ దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు సూచించింది. మరోవైపు ప్రభుత్వ జీవోలను సమర్థిస్తూ కొందరు మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ప్రస్తుత వ్యాజ్యాల్లో వారు కౌంటర్ వేసేందుకు ధర్మాసనం వెసులుబాటునిచ్చింది.
ఇదీ చదవండి : Ayyanna Case: అయ్యన్నపై తదుపరి చర్యలొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు