తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా... జనజీవనం ఎక్కడికక్కడ నెమ్మదించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమై, రహదారులపై నీరు చేరి ప్రజలకు అవస్థలు తప్పలేదు.
విశాఖలో భారీ వర్షాలకు ములగాడ గణపతినగర్‌లో ఓ ఇంటిపై కొండచరియ విరిగిపడిన ఘటన తీవ్ర విషాదానికి దారి తీసింది. ఇంటిలో నిద్రిస్తున్న రామలక్ష్మి అనే గర్భిణీతోపాటు ఆమె 2 సంవత్సరాల కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. షీలానగర్, గాజువాకలోని హరిజన జగ్గయ్యపాలెం, మిలిటరీ కాలనీ ప్రాంతాలు నీట మునిగాయి. జీవీఎంసీ రెవెన్యూ యంత్రాంగం సహాయ చర్యలపై దృష్టి పెట్టింది. అనకాపల్లిలో శారదా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నూకాంబిక ఆర్చ్ వద్ద రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. అవకండంలో వరి పొలాలు నీటి ముంపునకు గురై రైతులు ఆందోళన చెందుతున్నారు. సత్యనారాయణపురంలో దొంగ గెడ్డ నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున సమీప ప్రాంతాల వారిలో ఆందోళన నెలకొంది. జీవీఎంసీ భీముని గుమ్మం ఉన్నత పాఠశాల ప్రహారీ గోడపై చెట్టు కూలింది. కొప్పాక వద్ద ఏలేరు కాలువ జాతీయ రహదారిపై నుంచి ప్రవహిస్తున్నందున వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కశింకోట మండలం బయ్యవరం కాజ్‌వే నీటి ప్రవాహం స్తంభించిపోగా అధికారులు మరమ్మతులు చేపట్టారు. రైవాడ, తాండవ, కళ్యాణలోవ జలాశయాల్లో నీటి మట్టం గరిష్ఠానికి చేరుకొంది. నాతవరం మండలంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. చోడవరంలో దాదాపు 6 గంటలపాటు వర్షం కురిసింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో జనజీవనం స్తంభించింది. 24 గంటల్లోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాళ్ళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పంటచేలు నీట మునిగాయి. రెవెన్యూ శాఖ అధికారులు పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అమలాపురం డివిజన్‌లో భారీ వర్షపాతం నమోదైంది.
కడప జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీరంఖాన్ పల్లె సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో భూమి కుంగి... 20 మీటర్ల మేర గొయ్యి ఏర్పడింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. జనావాసాలు ఉన్న ప్రాంతంలో.... ఆయా ఘటనలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారి ఫిర్యాదుతో అధికారులు పరిశీలించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో వర్షాలు సమృద్ధిగా కురిసినందున.... చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నరసన్నపేటలో భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షాలు జనజీవనంపై ప్రభావం చూపాయి.
ఇదీ చదవండి: ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి: ఉత్తర్వులు జారీ