హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వాన నీటితో పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డికాపుల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఒడిశా తీరంలో స్థిరంగా కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఫలితంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
రైతులకు ఊరట
తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో బీడు వారిన నేలలు తడిసి ముద్దయ్యాయి. చినుకు జాడ కోసం ఎదురు చూస్తున్న రైతులు...రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తడారిపోయిన పంటపొలాలకు ఈ వానలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇదీ చూడండి: CM Jagan: సీఎం జగన్‌కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు..విచారణకు హాజరు కావాలని ఆదేశం