medaram sammakka sarakka: తెలంగాణలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మరో మూడ్రోజులే ఉండడంతో.. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండడంతో.. రద్దీ అధికంగా ఉంది. కుటుంబసమేతంగా వచ్చిన భక్తులు అమ్మవారికి చీర, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో అనేక మంది మేడారానికి వస్తుంటే.. కొందరు భక్తులు కాలినడకన తల్లులను దర్శించుకుంటున్నారు.
11 జాతరలకు కాలినడకనే..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నుంచి 250 మంది యువకులు.. మేడారానికి కాలినడకన పయనమయ్యారు. మార్గమధ్యలో గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. 11 జాతరలకు కాలినడకనే వచ్చినట్లు వీరు చెబుతున్నారు. ఖమ్మం నుంచి మరికొంతమంది భక్తులు కుటుంబ సమేతంగా కాలినడకన మేడారానికి బయల్దేరారు. కోరిన కోర్కెలు తీర్చిన సమ్మక్క సారలమ్మలను... కాలినడకన వెళ్లి దర్శించుకుంటామని.. మొక్కుకున్నట్లు వారు తెలిపారు.
ఆన్‌లైన్ ద్వారా కానుకలు..
jampanna vagu:గురువారం వరకు జంపన్నవాగులో నీళ్లు లేకపోవడంతో.. కుళాయిల కిందనే భక్తులు స్నానాలు చేశారు. ఈ నెల 10న లక్నవరం సరస్సు తూములు తెరవడంతో.. ఆ నీరు శుక్రవారం సాయంత్రం వరకు జంపన్నవాగుకు చేరాయి. దీంతో భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. మరోవైపు భక్తులు హుండీలో కాకుండా ఆన్‌లైన్ ద్వారా కానుకలు అందించేందుకు వీలుగా.. అధికారులు UPI క్యూ ఆర్ కోడ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కోడ్ స్కాన్ చేసి భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు.
మేడారానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించినట్లు అధికారులు తెలిపారు. మహాజాతరకు మరో మూడ్రోజులే సమయం ఉండడంతో.. వనదేవతల్ని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇదీ చూడండి:
Medaram Jatara: మేడారం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా.... హాట్ ఎయిర్ బెలూన్, పారా సెయిలింగ్ రైడ్లు