రాష్ట్ర ప్రజా నిర్వాహక ప్రకృతి వ్యవసాయంపై బ్లూమ్ అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, యూకేకి చెందిన ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. ప్రకృతి వ్యవసాయ పద్దతుల ద్వారా కలిగే ఆరోగ్య లాభాలపై అధ్యయనం చేసేందుకు ఎంవోయూ చేసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, రైతులకు మరింత ఆదాయం అందించటమే సీఎం జగన్ సంకల్పమని మంత్రి తెలిపారు. ఇది ఆరోగ్యపరమైన లాభాలను అందరికీ అందించే అద్భత అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు. కొవిడ్ లాంటి సమయాల్లోనూ గత ఏడాది కంటే రైతులు అధిక దిగుబడి సాధించారని వివరించారు. వాతావరణ మార్పు వల్ల భవిష్యత్తులో ఆహార భద్రతకు ఇబ్బంది లేకుండా వ్యవసాయ రంగాన్ని సిద్ధం చేయాలన్నారు.
రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ను ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సీఎం దృఢ నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో ఇది అమలు చేసేందుకు చురుగ్గా ముందుకు సాగుతున్నామని వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో దిగుబడి పెంచేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నామన్నారు. పురుగు మందుల వాడకం, రసాయన ఎరువులు క్రమంగా తగ్గించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. తద్వారా వినియోగదారుని ఆరోగ్యం, రైతులకు మరింత ఆదాయమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఏపీలో కర్నూలు, విశాఖ జిల్లాల్లో రెండువేల కుటుంబాల ఆరోగ్యంపై అధ్యయనం చేయనున్నామని వెల్లడించారు.
ఇదీచదవండి