Statue Of Equality: హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామనుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి సమతామూర్తి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. శ్రీరామనగరం విశేషాలను తెలుసుకున్న గవర్నర్.. 108 దివ్య దేశాల ప్రతీకలను దర్శించుకున్నారు.
Ramanuja Sahasrabdi Utsav: శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలు ఎనిమిదో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవ మూర్తులతో ప్రధాన యాగశాల నుంచి సమతాస్ఫూర్తి కేంద్రం వరకు రుత్విజుల శోభాయాత్ర కొనసాగింది. శోభాయాత్ర తర్వాత దివ్యక్షేత్రాల్లోని 20 ఆలయాల్లోని విగ్రహాలకు చిన్నజీయర్ స్వామి, వేద పండితులు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇప్పటికే శ్రీరామనగరంలోని 32 ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠ పూర్తయింది.
సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్...సెల్ఫ్ గైడెడ్ టూర్ ద్వారా శ్రీరామనగరం విశేషాలను తెలుసుకున్నారు. 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. సమతామూర్తి ప్రాంగణంలో మొక్కను నాటిన రాజ్ నాథ్ సింగ్.. లక్ష్మీనారాయణ క్రతువులో పాల్గొన్నారు. రాజ్‌నాథ్ వెంట కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ ఉన్నారు.
మరోవైపు యతి రామానుజాచార్యుల జయజయ ధ్వానాలతో ముచ్చింతల్ మార్మోగుతోంది. వేద పారాయణం.. అష్టాక్షరీ మహా మంత్ర జపం.. విష్ణు సహస్ర నామ పారాయణల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని భగవన్నామస్మరణలో మునిగిపోతున్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహంలో నగరం నుంచి పెద్దఎత్తున భక్తులు విచ్చేసి సమతామూర్తిని దర్శించుకుంటున్నారు. ప్రధాన యాగశాలలో పెరుమాళ్ స్వామికి పెద్దఎత్తున పూజలు చేస్తున్నారు.
ఈరోజు కార్యక్రమాలు..
ఉదయం 6.30కు అష్టాక్షరీ మహామంత్ర జపం. మధ్యాహ్నం పూర్ణాహుతి పూర్తైంది. ప్రవచన మండపంలో ఉదయం 9.30 గంటల నుంచి శ్రీరామానుజ అష్టోత్తర శతనామపూజ నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు హోమం ప్రారంభమై.. రాత్రి 9.30 గంటలకు ముగియనుంది. అకాల వృష్టి నివారణ, సస్యవృద్ధికి వైయ్యూహికేష్టి, దుష్టగ్రహ బాధ నివారణకు శ్రీనారసింహేష్టి నిర్వహిస్తారు. 20 దివ్య దేశాలలో దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ చేశారు.
14న స్వర్ణమూర్తి ప్రాణప్రతిష్ఠ..
ఈ నెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 120 కిలోల స్వర్ణమూర్తిని ఆవిష్కరించి లోకార్పణం చేస్తారని చిన జీయర్ స్వామి తెలిపారు. 14న విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందన్నారు.
ఇదీ చదవండి
టికెట్ ధరలకు సంబంధించి శుభంకార్డు పడిందని భావిస్తున్నాం: చిరంజీవి