రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న కారణంగా ప్రభుత్వ, ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు కొన్ని ఆసుపత్రులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో పడకలు దొరక్క బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 117 ఆసుపత్రుల్లో 2136 ఐసీయూ పడకలు ఏర్పాటు చేయగా.. వీటిలో 597 పడకలు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. మిగిలిన 1539 పడకలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండు మంచాలు ఉండే గదులు మొత్తం 9,544 ఉండగా.. వాటిలో 6756 పడకలు ఖాళీగా ఉన్నాయని.. సాధారణ వార్డుల్లో మొత్తం 4442 పడకలు ఉండగా.. వాటిలో 3130 పడకలు ఖాళీగా ఉన్నట్లు వివరించారు.
మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్లు పూర్తిగా అయిపోయాయని వైద్యాధికారులు తెలిపారు. ఇటీవల 6.4 లక్షల కోవీషీల్డ్, 2 లక్షల కోవాగ్జిన్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. వాటిని సచివాయాలు, ప్రత్యేక క్యాంపుల్లో, ఆసుపత్రుల్లో టీకా మహోత్సవ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న టీకా నిల్వలు అడుగంటి పోయాయి. కేంద్రం నుంచి వస్తే కానీ వ్యాక్సినేషన్ చేపట్టలేమని అధికారులు చెబుతున్నారు.
ఈనెల 17న 5 లక్షల డోసుల వ్యాక్సిన్ రాష్ట్రానికి చేరుకోనుందని అధికారులు తెలిపారు. నూతన డోసులు వస్తే.. వాటిని గన్నవరం వ్యాక్సినేషన్ కేంద్రం నుంచి అధికారులు జిల్లాలకు తరలించి టీకా కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి:
ప్రధానికి సీఎం జగన్ లేఖ.. 60 లక్షల కరోనా వ్యాక్సిన్లు పంపాలని విజ్ఞప్తి