రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌పై మాజీ మంత్రి జవహర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో డీజీపీ వాస్తవాలు ప్రకటిస్తారనుకుంటే అసత్యాలు చెప్తున్నారని విమర్శించారు. సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని దాడుల చేసిన వారిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. మంత్రులు తిరుమల కొండమీద అన్యమత ప్రచారం చేస్తే డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆంజయనేయ స్వామి చెయ్యే కదా విరిగింది ఏమవుతుందని మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని అన్నారు. అసలు నిందితులైన మంత్రులను వదిలేసి.. అమాయకులపై కేసులు పెడుతున్నారన్నారని వ్యాఖ్యానించారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టిన కొడాలి నానిని అరెస్ట్ చేస్తే సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పూజారులను కొరడాతో కొట్టినవారిని అరెస్ట్ చేయకపోవడం.. పక్షపాతం చూపించడమేనని విమర్శించారు. రాష్ట్రంలో రూల్ అప్ లా సక్రమంగా అమలయ్యేలా డీజీపీ వ్యవహరించాలని హితవు పలికారు. గౌతం సవాంగ్ డీజీపీలా మాట్లాడకుండా మంత్రిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.