బడుగు వర్గాలు, ఎస్సీలపై దాడులతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరిగినన్ని దాడులు, వేధింపులు, హత్యలు, శిరోముండనాలు ఎక్కడా జరగలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు... కానీ ఈ దురాగతాలు, దుశ్చర్యలు నిత్యకృత్యాలయ్యాయని దుయ్యబట్టారు. దళితులపై ఇన్ని ఆకృత్యాలు జరుగుతున్నా, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వపెద్దల్లో స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నించటమే నేరమా?
వరప్రసాద్‌కు శిరోముండనం చేయడానికి ఎస్సైకి ఏం పని అని నక్కా నిలదీశారు. ఆ సంఘటన మరవకముందే విశాఖలో శ్రీకాంత్ అనే ఎస్సీ యువకుడిని దారుణంగా కొట్ట..., శిరోముండనం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ మద్యం పాలసీపై ప్రశ్నించడమే ఓం ప్రతాప్ నేరమా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఓం ప్రతాప్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వైకాపా ప్రభుత్వం ఎస్సీలకు ఏం ఒరగబెట్టకపోయినా పర్వాలేదు గానీ... ఇంత హీనంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి రూపాయి కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని నక్కా ఆరోపించారు. జస్టిస్ పున్నయ్య రికమండేషన్‌తో వచ్చిన ఎస్సీ , ఎస్టీ కమిషన్‌ను జగన్ నిర్వీర్యం చేశారని ఆక్షేపించారు.
ఇవీ చదవండి: విశాఖలో దారుణం... ఎస్సీ యువకుడికి శిరోముండనం..!