ఎరువుల ధరలు కళ్లెం లేకుండా పెరుగుతున్నాయి. డీఏపీ మినహా బస్తాకు సగటున 50% పైనే పెరిగాయి. అంతర్జాతీయంగా ముడిసరకు ధరల్లో సగటున వందశాతం మేర పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో దేశీయంగానూ తయారీ సంస్థలు ధరలు పెంచుతున్నాయి. డీఏపీ మాత్రం కేంద్ర విధానానికి అనుగుణంగా రూ.1,200 వద్దనే ఆగింది. ఖరీఫ్ వరకూ ఇదే ధరకు అమ్మాలని నిర్దేశించిన కేంద్రం.. రబీలో దీన్ని పొడిగించేందుకు పచ్చజెండా ఊపింది. దీంతో ఎరువుల సంస్థలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచాయి. కొన్ని సంస్థలు పాత ధరల ప్రకారమే విక్రయిస్తుండగా.. మరికొన్ని పెంచేశాయి. ఖరీఫ్, రబీ పంటల కీలక సమయంలో ఎరువుల ధరలు పెరగడం, ఉత్పత్తి మందగించడం రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పెట్టుబడులు ఎక్కువ కావడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ ఏడాది జూన్‌కు (ఖరీఫ్) ముందు.. 20.20.0.13 రకం ఎరువుల బస్తా (50 కిలోలు) ధర రూ.925.. తర్వాత క్రమంగా పెరుగుతూ అక్టోబరు (రబీ) నాటికి రూ.1,300 దాటింది. నాలుగు నెలల్లోనే బస్తాపై రూ.375 పెరిగింది. యూరియా, డీఏపీ తర్వాత రైతులు అధికంగా వినియోగించే 28.28.0, 14.35.14 రకం ఎరువుల ధరలూ.. బస్తాకు రూ.425 పెరిగాయి. 10.26.26 రకం ఎరువుల బస్తా ధర రూ.1,175 నుంచి రూ.1,700, పొటాష్ ధర రూ.875 నుంచి రూ.1,600 వరకు చేరింది.
పెరిగిన ముడిసరకు ధరలు: రసాయన ఎరువుల తయారీకి ఉపయోగించే ముడిసరకుల ధరలు అంతర్జాతీయంగా పెరిగాయి. ఫాస్ఫారిక్ ఆమ్లం ధర.. గతేడాది ఆగస్టులో టన్నుకు 625 డాలర్లు ఉండగా.. ఈ ఏడాది ఆగస్టు నాటికి 1,160 డాలర్లకు చేరింది. ప్రస్తుతం 1,400 డాలర్ల వరకు చెబుతున్నారు. అమ్మోనియా 207 డాలర్ల నుంచి 625, సల్ఫర్ 73 డాలర్ల నుంచి 214 డాలర్లకు చేరాయి. పొటాష్ కూడా 230 డాలర్ల నుంచి అక్టోబరులో 485 డాలర్లకు చేరింది. డీఏపీ ధర అక్టోబరు 336 డాలర్లు ఉండగా. ఆగస్టులో 641 వరకు చేరింది. ఇదీ 800 డాలర్లకు చేరుతుందని కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. దీంతో తయారీసంస్థలు దిగుమతులు తగ్గించాయి. ఉత్పత్తి కూడా మందగించింది.
ఉత్తరాదికే డీఏపీ: రబీలోనూ డీఏపీ రాయితీ కొనసాగింపునకు అంగీకరించిన కేంద్రం.. దిగుమతి చేసుకోవాలని తయారీ సంస్థలకు సూచించింది. ఉత్తరభారతంలోని రాష్ట్రాలకు సరఫరాపై దృష్టిపెట్టింది. త్వరలో జరగబోయే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల నేపథ్యమూ.. అక్కడికి ఎరువుల సరఫరా పెంపుపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం పోర్టుల్లో ఉన్న నిల్వల్లో అధికశాతం ఉత్తరాదికే సరఫరా చేయాలని నిర్దేశించింది.
ఇదీ చదవండి: పల్లెల్లో కోతలు.. లోడ్ సర్దుబాటు కోసం 2-3 గంటల సరఫరా నిలిపివేత