కుమార్తెను హత్య చేసిన కేసులో తండ్రిని కృష్ణా జిల్లా విజయవాడలోని కొత్తపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట మాకినవారివీధిలో జగ్గుపిళ్ల రాజా, యుంగధరి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి పాప దేవేంద్రిత(7) ఉంది. రాజా గొల్లపూడిలోని మెడికల్ షాపులో పని చేస్తూ ఫిబ్రవరి నెలలో మానేశాడు. అప్పటి నుంచి పని లేదు, కుటుంబ పోషణ, ఈఎంఐలు, ఇంటి అద్దె, క్రెడిట్‌కార్డు బిల్లులు, కుమార్తె పాఠశాల ఫీజు కట్టాలని తదితర విషయాలపై భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఏప్రిల్ 28న కూడా గొడవ జరగ్గా భార్య పంచాయతీ పెడతానని, మెయింట్‌నెన్స్ కేసు వేస్తానని హెచ్చరించింది.
భార్య మెయింట్‌నెన్స్ కేసు వేస్తానన్నందకు కూతురి హత్య..
ఆ విషయాలను మనసులో పెట్టుకుని పాప బతికి ఉండటం వల్ల తన భార్య మెయింట్‌నెన్స్ కేసు వేస్తుందని, పాపను చంపేస్తే కేసు వేయలేదని ఉద్దేశంతో పాపను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఏప్రిల్ 29 మధ్యాహ్నం భార్య తన తల్లి ఇంటి వద్ద భోజనం తీసుకు రావడానికి వెళ్లింది. అదే సమయంలో మంచంపై పడుకుని ఉన్న తన కుమార్తె చరవాణిలో గేమ్స్ ఆడుకుంటోంది. అదే అదనుగా చేసుకున్న తండ్రి తన కుమార్తెను దిండుకు గట్టిగా అదిమి పెట్టి చంపాడు.
ఈలోగా తల్లి వచ్చి తన కుమార్తెను లేపగా లేవలేదు. వెనక్కి తిప్పి చూడగా ముఖం నీలిరంగుగా మారి ఉంది. ఏం జరిగిందని భర్తను అడిగింది. వెంటనే తన కుమార్తెను భుజంపై వేసుకుని ఆసుపత్రికి తీసుకు వెళ్లగా వైద్యులు పరీక్షించి పాప చనిపోయినట్లుగా ధ్రువీకరించారు. ఆ విషయం తెలుసుకున్న తండ్రి రాజా అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పశ్చిమ ఏసీపీ హనుమంతరావు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టిన ఇన్‌ఛార్జి సీఐ చలపతిరావు నిందితుడు రాజాను భవానీపురంలో అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: