కరోనా పేరు చెబితేనే అందరూ వణికిపోతుంటే.. సైబర్ నేరగాళ్లు తమదైన శైలిలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొవిడ్ చికిత్స పేరు చెప్పి అందినంత దోచుకుంటున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ నకిలీ ఖాతాలు సృష్టించి.. స్నేహితులు, బంధువులు, తెలిసినవారికి మెసేజ్‌లు పంపి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి ఉదంతమే తాజాగా విజయవాడలో వెలుగుచూసింది. గుణదలలో నివసించే వైద్యుడు రాజశేఖర్ ఫేస్‌బుక్ ఖాతాకు రాత్రి వేళ.. తనకు తెలిసిన ఓ ఉపాధ్యాయుడి ఫేస్‌బుక్ ఖాతా నుంచి మెసేజ్ వచ్చింది.
ఓ విద్యార్థికి కొవిడ్ సోకింది.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఆర్థిక సహాయం చేయండని అవతలి వ్యక్తి మెసేజ్ చేశాడు. ఆ ప్రొఫైల్‌లో ఉపాధ్యాయుడి ఫోటో, వివరాలు ఉండటంతో.. అంతా నిజమని నమ్మిన రాజశేఖర్.. అతడితో చాటింగ్ చేశాడు. అవతలి వ్యక్తి తన గూగుల్ పే ఖాతాకు డబ్బు పంపాలని కోరగా.. రాజశేఖర్ విడతల వారీగా 50 వేల వరకు నగదు పంపారు.
మరుసటి రోజు ఉదయం ఆ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసిన రాజశేఖర్.. డబ్బు పంపిన విషయం ప్రస్తావించారు. తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని.. తన పేరు చెప్పి చాలా మంది దగ్గర డబ్బు వసూలు చేశారని ఆయన చెప్పగానే రాజశేఖర్ నిర్ఘాంతపోయారు. మోసం గ్రహించి వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించారు. తాను కష్టాల్లో ఉన్నపుడు స్నేహితులు తనకు సాయం చేశారన్న ఆలోచనతో డబ్బు పంపాలనుకున్నానని రాజశేఖర్ తెలిపారు.
ఇలా మోసపోతానని ఊహించలేదన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు. ఇలాంటివి నెలరోజుల్లో ఏడు కేసులు నమోదయ్యాయని సైబర్ పోలీసులు తెలిపారు. డబ్బు పంపాలని మెసేజ్‌లు చేస్తే.. నిర్ధరించుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: