విజయవాడ రైల్వే స్టేషన్‌ను 99 ఏళ్లపాటు ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధం కావడాన్ని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు తప్పుపట్టారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు లాభపడుతాయే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. ప్రయాణికులతో అత్యంత రద్దీగా, లాభదాయకంగా ఉంటూ సమర్థమంతంగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ తరహా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం సబబు కాదని విమర్శించారు.
ఇదీ చదవండి: 'కరోనా కట్టడికి జాతీయ విధానమేది?'
కొన్ని ముఖ్యమైన రైళ్లు, రైల్వే భూములు, రైల్వే క్రీడా మైదానాలను విక్రయించనున్నట్లు.. ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం సిగ్గుచేటని మాజీ ఎంపీ విమర్శించారు. ప్రజల ఆస్తులను అమ్మేందుకు భాజపాకు అధికారం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా ప్రైవేట్ పరం చేయాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణకు భిన్నంగా మోదీ ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. ఈ తరహా తుగ్లక్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: దేవినేనిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు