కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాసవాన్ మరణం తనకెంతో బాధ కలిగించిందని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాసవాన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2008లో న్యూయార్క్ నగరంలో జరిగిన ప్రపంచ దళిత మైనార్టీ మహాసభలో పాసవాన్‌తో కలిసి పాల్గొనటం ఓ మధుర జ్ఞాపకమన్నారు.
గుంటూరులో సంస్మరణ సభ
ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాసవాన్ సంస్మరణ సభ గుంటూరులో జరిగింది. గుంటూరు అంబేడ్కర్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పాసవాన్ అకాల మరణం బాధాకరమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. దళిత, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారన్నారు.
పాసవాన్ మరణంతో దేశంలో దళితుల గొంతుక మూగబోయిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. దళితులు, బడుగుబలహీన వర్గాలకు అంబేడ్కర్ ఇచ్చిన హక్కులను అందించేందుకు ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. దళిత నాయకుడిగా 8 సార్లు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు. అనేక పదవులు నిర్వహించి దళితులకు సేవలందించారన్నారు.
ఇవీ చదవండి..
విగ్రహాల తయారీ పరిశ్రమపై కరోనా ఎఫెక్ట్..కార్మికులకు లేని ఉపాధి