Employees protest to abolish CPS: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దే లక్ష్యంగా సెప్టెంబర్1 న మిలీనియం మార్చ్ నిర్వహించాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ తమను నిలువునా మోసం చేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుచేయకుండా జీపీఎస్ అమలు చేస్తామంటూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. సీపీఎస్ రద్దు చేయని పక్షంలో తమ సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు
సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు ఆందోళన కొనసాగుతోంది. ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో పోరాటం చేస్తోన్న ఉద్యోగులు విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టారు. 'ఓపీఎస్ సంకల్పదీక్ష' పేరిట ఆందోళనకు దిగారు. సీపీఎస్ రద్దు చేయకపోవడాన్ని నిరసిస్తూ 'దగాకోరు మోసం' అంటూ దీక్షా స్థలిలో బ్యానర్లు ప్రదర్శించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసిన ఛత్తీస్గఢ్, రాజస్థాన్ సీఎంలను ప్రసంశిస్తూ సీపీఎస్ ఉద్యోగుల పాలిట దేవుళ్లంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫొటోలకు సీపీఎస్ ఉద్యోగులు పాలభిషేకం చేశారు.
ఆందోళనకు పలు జిల్లాల నుంచి ఉద్యోగులు తరలివచ్చారు. కార్యక్రమానికి ఏపీసీపీఎస్యూఎస్ నేతలు, ఎపీఎన్జీవో, సచివాలయంలోని పలు విభాగాల ఉద్యోగ సంఘాల నేతలు మద్దతిచ్చారు. ఆగస్టు 30 లోపు.. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సెప్టెంబర్ 1న విజయవాడలో 4లక్షల మంది ఉద్యోగులతో మిలీనియం మార్చ్ నిర్వహించాలని తీర్మానించారు. ఇకపై కలసి ఉద్యమం చేయాలని సీపీఎస్ పై పోరాడుతోన్న రెండు ప్రధాన ఉద్యోగ సంఘాలు ఏపీసీపీఎస్ఈఏ, ఏపీసీపీఎస్యూఎస్ నిర్ణయించాయి. ముఖ్యమంత్రి జగన్ తమను తీవ్రంగా మోసం చేశారని..జీపీఎస్ పేరుతో మరోమారు ఉద్యోగులను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.
జీపీఎస్ విధానం సమ్మతం కాదని ఏపీఎన్జీవో నాయకుడు విద్యాసాగర్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుని న్యాయం చేయాలని లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని సీపీఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు.
ఇవీ చదవండి :