దీపావళి సమయంలో బాణసంచా పేలుళ్లకు చాలా దూరంగా ఉంటారు. మూడు రోజుల ముందు నుంచే ఉపవాసాలు చేస్తారు. దానధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతారు. పండగ రోజున లక్ష్మీదేవీ, సరస్వతి దేవీలతోపాటు తమ మతగురువులను పూజిస్తారు. దీపాలు వెలిగించి వాటి కాంతుల మధ్య సమాజంలో అశాంతి, అరాచకం, అనైక్యత వంటి రుగ్మతల చీకట్లను పారదోలి ప్రజలంతా శాంతి సౌఖ్యాలతో ఉండాలని దేవున్ని వేడుకుంటారు. రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుంచి నేటి వరకు ఇదే ఆచారం. తరాలు మారినా.. ఏ మాత్రం చెక్కుచెదరని ఆచారాన్ని కొనసాగిస్తుండటం జైనుల ప్రత్యేకత. దీపావళి సందర్భంగా జైన్ కుటుంబీకుల్లో ఎవరెక్కడ ఉన్నా అంతా తమ నివాసాలకు వస్తారు. కుటుంబ పరివారం అంతా కలిసి ఉపవాసాలు, పూజల్లో పాల్గొంటారు. అలాగే వీరు దీపావళి రోజునే వ్యాపారాలకు సంబంధించి బ్యాలెన్స్ షీట్స్ వేసుకుంటారు.
విజయవాడ నగరంలోనూ సుమారు 40 వేల మంది వరకు జైన్ కుటుంబాలున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశం నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చి.. బంగారం ఆభరణాల విక్రయాలు, విద్యుత్తు, గృహోపకరణలు వంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఈ ఏడాది దీపావళిని వారి ఆచారాల ప్రకారమే జరుపుకుంటున్నారు.
ఇవీ చదవండి