కృష్ణాజిల్లా గన్నవరంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. విజయవాడ రూరల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే వంశీ మోహన్ అందజేశారు. ఇంతటి బృహత్కర కార్యక్రమాన్ని వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పర్వదినాన ప్రారంభించడం శుభపరిణామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బాపట్ల:
నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉప సభాపతి కోన రఘుపతి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని.. పేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు. ప్రతి కుటుంబానికి ఇళ్లస్థలాల రూపంలో పది లక్షల రూపాయల ఆస్తిని సీఎం అందజేశారని ఉపసభాపతి తెలియజేశారు.
చిత్తూరు జిల్లా:
పుత్తూరు మున్సిపాలిటీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే రోజా నిర్వహించారు. మూడు వందల చదరపు అడుగుల స్థలాన్ని ఒక్క రూపాయికే సీఎం అందిస్తున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తున్న కాలనీలో అన్నీ సౌకర్యాలకు సంబంధించి ఇప్పటికే నిధులు కూడా మంజూరు చేశారని చెప్పారు. గృహ నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ' వైఎస్‌ఆర్ జగనన్న ఇళ్లు కాదు.. వేల ఊళ్లు కడుతున్నాం'