రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు కుటుంబాలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజా రక్షణకై కుటుంబాలను వదిలి ప్రజాసేవలో నిమగ్నమైన పోలీసులను ఆయన అభినందించారు. కరోనా వ్యాప్తి జరగకుండా ప్రజలను కాపాడాలని కోరారు. వైరస్ ప్రాణాంతకమని తెలిసినా అందరూ ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నందుకు డీజీపీ హర్షం వ్యక్తం చేశారు . ఆహారం, ఆరోగ్యం, మౌళిక వసతులు సరిగా లేకున్నా ప్రజల మంచి కోసం మండుటెండలో రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.
పోలీసులు సమయానికి భోజనం చేయకపోయినా.. ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెడుతున్నారని అభినందించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రజలందర్ని స్వీయ నిర్బంధంలో ఉంచారన్నారు. వారికి భద్రతగా ఉంటూ ప్రాణాలను త్యాగం చేయటానికి సిద్దపడిన పోలీసు సిబ్బంది సేవలను కొనియాడారు. రోడ్లపై పికెట్లు, చెక్ పోస్టుల వద్ద పోలీసులు చేస్తున్న విధుల్లో డీజీపీ సైతం భాగస్వామ్యం అవుతున్నట్లు లేఖలో తెలిపారు.
తమ వంతు ప్రయత్నంగా దాతల సహకారంతో లక్షల రూపాయల విలువైన మాస్కులను, శానిటైజర్లను, గ్లౌజులను సిబ్బందికి అందించామన్నారు. అంతేకాక 55 యేళ్లు నిండినా, కొద్దిపాటి అనారోగ్యం ఉన్న వారికి క్షేత్రస్థాయి విధుల నుంచి తప్పించి, పోలీస్ స్టేషన్లకు జనరల్ డ్యూటీలకు పరిమితం చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. 24x7 వెల్ఫేర్ డెస్క్ ఫర్ పోలీస్ ఫ్యామిలీస్ ఏర్పాటు చేస్తున్నామని.. ఇది నిరతరం ఎస్పీ పర్యవేక్షణలో పని చేస్తుందన్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసులు