పోలీసుల సహజ మరణానికి ఇచ్చే బీమా పెంచుతూ డీజీపీ గౌతం సవాంగ్ నిర్ణయం తీసుకున్నారు. బీమాను రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచడానికి నిర్ణయించారు.
రేపటినుంచి 10 రోజులపాటు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాలు జరపనున్నట్లు డీజీపీ తెలిపారు. ఎస్బీఐ పోలీసు శాలరీ ప్యాకేజీలో ఉన్నవారిని బీమా పథకంలో కవర్ చేస్తారని చెప్పారు. ఎస్బీఐతో పోలీసుల కోసం జీవన్‌జ్యోతి బీమా, సురక్ష బీమా ఎంఓయూపై డీజీపీ సంతకం చేశారు. బ్యాంకు సిబ్బంది ప్రతి పోలీసుస్టేషన్‌కు వెళ్లి రేపటినుంచి పాలసీలు ఇస్తారని డీజీపీ వివరించారు.
రేపు ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుతున్నట్లు డీజీపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల దినోత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో పోలీసులు ముందు వరుసలో ఉండి పోరాడారన్నారు. పోలీసు కుటుంబ సభ్యుల్లో ఉన్న వైద్యులు, పోలీసు సిబ్బందికి వైద్య సేవలందించారని కొనియాడారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రాష్ట్రంలో నేరాల శాతం తగ్గిందని డీజీపీ అన్నారు. దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఏపీ పోలీస్ యాప్ పేరుతో 88 రకాల సేవలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. నగరంలో సంచలనం రేపిన దివ్య తేజస్విని హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశామని.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని డీజీపి హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి..