Decreasing salaries with new PRC: ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయంటూ 2021 డిసెంబరు పే స్లిప్పును, 2022 జనవరి పే స్లిప్పును చూపించి ప్రభుత్వం చెబుతున్న లెక్కలను ఉద్యోగ సంఘ నాయకులు ఉదాహరణలతో కొట్టిపారేస్తున్నారు. కరవు భత్యం లెక్కల్లో తప్పులు చూపించి, డిసెంబర్ నెలలో ఇవ్వాల్సిన డీఏను లెక్కల్లోకి తీసుకోకుండా కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల నుంచి రికవరీ చేయడం లేదని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్న వాదననూ తోసిపుచ్చుతున్నారు.
ఎలా తగ్గుతున్నాయంటే..
ప్రభుత్వం కొత్త పీఆర్సీ జీతాలను 2020 ఏప్రిల్ నెల నుంచి లెక్కిస్తోందని.. 2020 మార్చి నెలలో ఒక ఉద్యోగి పొందిన జీతం ఎంత? 2020 ఏప్రిల్‌లో కొత్త పీఆర్సీ ప్రకారం ఆ ఉద్యోగికి వచ్చిన జీతం ఎంతో లెక్కించి చూడాలని ఏపీ ఎన్జీవో ఐక్య కార్యాచరణ సమితి ఉపాధ్యక్షుడు ఎండీ ఇక్బాల్ అన్నారు. కొందరు ఉద్యోగులకు పాత జీతాల కన్నా కొత్త జీతాలు తగ్గిపోతున్నాయంటూ కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారు.
రికవరీ ఉందని మీ జీవోలే చెబుతున్నాయి కదా?
ఉద్యోగుల నుంచి అసలు రికవరీయే లేదని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారని.. కొత్త పీఆర్సీ అమలును పేర్కొంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లోనే సర్దుబాటు (రికవరీ) చేస్తున్నట్లు పేర్కొన్నారని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సీహెచ్ పాపారావు పేర్కొన్నారు. ఉద్యోగులకు, పింఛనర్లకు సైతం ప్రభుత్వం కొత్త వేతన సవరణ ప్రకారం ఫిక్సేషన్ చేస్తే చాలామంది ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి వస్తోందని, రూ.లక్షకు పైగా తిరిగి చెల్లించాల్సి వస్తోందని కూడా కొందరు ఉద్యోగులు తమకు లెక్కలు వేసుకుని చెబుతున్నారని ఆయన వివరించారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం రివకరీ చేయకపోయినా, భవిష్యత్తులో ఇచ్చే డీఏలు, డీఆర్‌ల నుంచి ఆ మొత్తాన్ని మినహాయించుకుంటామని స్పష్టంగా జీవోల్లో పేర్కొన్న విషయాన్ని ఉద్యోగ సంఘ నాయకులు గుర్తుచేస్తున్నారు. ‘కొత్త పీఆర్సీ అమలు విధివిధానాలు పేర్కొంటూ ప్రభుత్వం జనవరి 17న ఇచ్చిన జీవో 1లో పదో పేజీ 12.4వ పాయింటులో రికవరీ విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగులు తీసుకున్న ఐఆర్‌ను లెక్కించి ఆ మొత్తాన్ని డీఏ ఎరియర్సు (బకాయిల) నుంచి మినహాయిస్తామని జీవోలో వివరించింది. అలా మినహాయించిన తర్వాత ఉద్యోగులకు ఇంకా ఎరియర్స్ (బకాయిలు) రావాల్సి ఉంటే నాలుగు వాయిదాల్లో వారి జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తామని ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవేళ ఉద్యోగులే ప్రభుత్వానికి బకాయి పడి ఉంటే ఆ మొత్తాన్ని భవిష్యత్తులో ఇచ్చే డీఏ బకాయిల నుంచి మినహాయించుకుంటామని స్పష్టంగా జీవోల్లో తేల్చిచెప్పిందని పాపారావు వివరించారు.
- రూ.43,680 పాత మూలవేతనంగా ఉన్న ఉద్యోగి ప్రభుత్వానికి రూ.72,252 భవిష్యత్తు డీఏల రూపంలో సమర్పించుకోవాల్సి ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో డీఏల రూపంలో రూ.6 వేల నుంచి రూ.లక్షకు పైగా తాము తిరిగి చెల్లించాల్సి ఉందని మరికొందరు లెక్కలేసి చెబుతున్నారు.
- పెన్షనర్లు కూడా భవిష్యత్తులో అందే డీఆర్ రూపంలో ఇలా చెల్లించుకోవాల్సి ఉంటుందని వారికి ఇచ్చిన జీవోలో 19.3 పాయింటులో స్పష్టం చేశారు. అదే జీవోలో 10వ పేజీలో ఒక ఉదాహరణ ఇస్తూ ఆ పెన్షనర్ రూ.70,939 వెనక్కు చెల్లించాల్సి ఉంటుందని, భవిష్యత్తులో డీఆర్‌ల నుంచి ఆ మొత్తాన్ని మినహాయించుకుంటామని స్పష్టంగా పేర్కొని కూడా రికవరీ లేదని ప్రభుత్వ ప్రతినిధులు ఎలా చెబుతారంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అదే జీవో 11వ పేజీలో మరో పింఛనర్ రూ.1,07,170 వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వమే వివరించిందనీ ప్రస్తావిస్తున్నారు.
ఐఆర్ కూడా మినహాయిస్తున్నారు!
మధ్యంతర భృతి కూడా మినహాయిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘2019 జులై నుంచి 27 శాతం ఐఆర్ అమలు చేశారు. ప్రస్తుతం కొత్త పీఆర్సీలో భాగంగా జులై నుంచి 2020 ఏప్రిల్‌లో కొత్త వేతన స్థిరీకరణ చేసే వరకు 9 నెలల కాలానికి మధ్యంతర భృతి మొత్తాన్ని మినహాయించుకుంటున్నారు’ అని రాష్ట్ర ఏఈవోల సంఘం సహాధ్యక్షులు ఎస్.ప్రవీణ్ అన్నారు.
ఇదీ చదవండి: Chalo Vijayawada: 'చలో విజయవాడ'పై ఉక్కుపాదం... ఉద్యోగ, ఉపాధ్యాయుల గృహనిర్బంధం