కొవిడ్ ఉద్ధృతికి సుమారు ఏడాదిన్నరగా నిలిచిపోయిన చేనేత కళా ప్రదర్శనలు.. విజయవాడ బాపు మ్యూజియంలో పునఃప్రారంభమయ్యాయి. చేతి వృత్తులను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం క్రాఫ్ట్ మేళాలను నిర్వహిస్తోంది. అయితే కరోనా కారణంగా ఏడాదిన్నరపాటు ఈ చేనేత కళా ప్రదర్శనలు సరిగ్గా జరగలేదు. కొవిడ్ రెండో దశ తగ్గుముఖం పట్టినందున.. చేనేత, హస్త కళాకారులకు వారి వస్తువులు ప్రదర్శించి విక్రయించుకునేందుకు నగరంలోని బాపు మ్యూజియంలో అనుమతి ఇచ్చారు. గత నెల 14న ఆరంభమైన క్రాఫ్ట్ మేళా..ఈ నెల 12 దాకా సాగనుంది.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే పురాతన హస్తకళలను ప్రదర్శించటమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళలు ఈ ప్రదర్శనలో ఉంచారు. దేశంలోని 14 రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత, హస్త కళాకారులు.. తమ వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, బంజారా హ్యాండ్ ఎంబ్రాయిడరీ సహా మంగళగిరి, పోచంపల్లి, చీరాల, కశ్మీరీ సిల్క్ వంటి వివిధ రకాల చీరలు అందుబాటులో ఉంచారు. మార్కెట్ ధరలతో పోలిస్తే.. రాయితీనీ అందిస్తున్నామని కళాకారులు చెబుతున్నారు.
' మొదట్లో జనం తక్కువగా వచ్చినా.. రోజురోజుకూ పెరుగుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కస్టమర్స్ పదర్శనకు వస్తున్నారు. కరోనా రెండో దశ తర్వాత ఈ ప్రదర్శన మొదటి సారి. జీవనోపాధి కోసమే ఈ ప్రదర్శన' - హస్త కళాకారుడు
'పొందూరు నుంచి వచ్చాము. ఇక్కడ మంగళగిరి, పోచంపల్లి, గద్వాల్, కశ్మీరీ హ్యాండ్ లూమ్స్, పొందూరు ఖద్ధరూ దొరుకుతాయి. 14 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాం. ఇప్పుడిప్పుడే దుకాణాలు తెరుచుకుంటున్నాయి' -చేనేత కళాకారుడు
'మేము చేనేత కళాకారులం.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. కస్టమర్స్ మమ్మల్ని ఆదరిస్తే.. ప్రదర్శన చక్కగా జరుగుతుంది. ఒక చీర తయారు చేయడానికి మొత్తం ముగ్గురు నలుగురు వ్యక్తులు కష్టపడాలి. మీరు వచ్చి ఒక వస్తువును కొంటే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా.. ఒక కుటుంబాన్ని ఆదుకున్నట్లే' - చేనేత కళాకారుడు
'మనం లాభం పొందడమే కాకుండా.. కళాకారులకూ చేయుతనిచ్చినట్లు ఉంటుంది. అందరూ వచ్చి చూసి.. మీకు నచ్చితేనే కొనండి. మీరు వచ్చారంటే కచ్చితంగా కొంటారు.' - కస్టమర్
కరోనా కాలంలో తమ వస్తువులు కొనేవారు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని హస్త కళాకారులు విచారం వ్యక్తం చేశారు. ఈ క్రాఫ్ట్ మేళాల వల్ల తమ కుటుంబాలు కాస్తయినా ఆర్థికంగా.. కుదుటపడిముందుకు నడుస్తాయని చెబుతున్నారు. మేళాకు వచ్చి.. ఎవరికి కావాల్సిన వస్తువులు వారు కొనుక్కుంటే.. కష్టాల్లో ఉన్న తమను ఆదుకున్నట్టు అవుతుందని కళాకారులు అంటున్నారు.
ఇదీ చదవండి:
CM Jagan: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి: ముఖ్యమంత్రి జగన్