CPI State Secretary Ramakrishna: మూడు రాజధానులపై ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టుకు వెళ్లడం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై కోర్టులు పదేపదే మొట్టికాయలు వేసినప్పటికీ వైకాపా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతినే రాజధానిగా గుర్తించి అభివృద్ధి చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గత 6 నెలలుగా అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ప్రతిపక్షనేతగా ఉండగానే గత శాసనసభలో అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించడం జగన్మోహన్ రెడ్డి అంగీకరించటం మరిచారా అని రామకృష్ణ ధ్వజమెత్తారు. అమరావతిని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే జగన్ 3 రాజధానుల అంశాన్ని మరోమారు తెరపైకి తెస్తున్నారన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ శాసనసభలో చేసిన నిర్ణయాన్ని వైకాపా ప్రభుత్వం మార్చాలనుకోవడం శాసనవ్యవస్థను అవమానించడం కాదా అని దుయ్యబట్టారు. నిజంగా శాసనవ్యవస్థపై జగన్ ప్రభుత్వానికి గౌరవముంటే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: