రాష్ట్ర ప్రజలు వైకాపాకి 151 సీట్లు ఇచ్చి గెలిపించినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం.. భాజపా కనుసన్నల్లోనే పాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ప్రజావ్యతిరేక చట్టాలను స్వాగతించిన పార్టీ దేశంలో ఒక్క వైకాపా మాత్రమేనని దుయ్యబట్టారు.
దేశంలోని భాజపాకు వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన తరుణమిదేనని నారాయణ అన్నారు. తొలిగా ఎర్రజెండా పార్టీలు కలవాల్సిన సమయం వచ్చిందన్నారు. అక్టోబరులో విజయవాడలో జరగనున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. అదేనెల కేరళలో జరగనున్న సీపీఎం జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ఈ విషయమై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆగస్టులో మరోసారి: పెంచిన విద్యుత్ ఛార్జీలతో పాటు.. ఆగస్టులో మరోసారి ధరల భారం మోపబోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా గ్రామ సచివాలయ స్థాయి నుంచి ఆందోళనలు చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పోటీ పడుతూ ప్రజలపై పెను భారాలు మోపుతున్నారని విమర్శించారు.
తాము అనుకూలమే.. కానీ: పోలవరం విషయంలో కేంద్ర, రాష్ట్రం నాటకాలు ఆడుతున్నాయని.. ప్రభుత్వాల చర్యలను నిరసిస్తూ ఏప్రిల్ 19వ తేదీన చలో పోలవరానికి రామకృష్ణ పిలుపునిచ్చారు. జిల్లాల పునర్విభజనకు తాము అనుకూలమేనని.. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రక్రియ జరగలేదన్నారు. 12వేల మంది తమ అభిప్రాయాలను చెబితే.. వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో కొత్త జిల్లా.. గిరిజనుల కోసం ఏర్పాటు చేయవచ్చు: మంత్రి పేర్ని