'కనపడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం అంతా'.. ఈ పాట రంగస్థల కళాకారుల ప్రస్తుత దయనీయ స్థితికి అద్దం పడుతుంది. ఆ కనపడని చేయి పేరే కరోనా వైరస్. దాని కబంధ హస్తాల్లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. ఎలాంటి విషయమైనా ప్రజలకు సులభంగా చేరవేసే స్థాయి నుంచి ఈ తరం వారికి పెద్దగా తెలియని స్థాయికి నాటకరంగం పడిపోయింది. కళపై మక్కువతో కొందరు ఇప్పటికీ అరకొర నాటకాలు వేస్తూ నాటక రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
ఒక్క విజయవాడలోనే వందలాది కళాకారులు ఇప్పటికీ రోజూ పద్యాలు సాధన చేస్తుంటారు. నాటకాలు ఉన్నా లేకున్నా కళను బతికించుకునేందుకు సాధన ఆగదని కరోనా దెబ్బకు మొత్తం అతలాకుతలమైందని విలపిస్తున్నారు. చిన్నతనం నుంచే రంగస్థలాన్ని నమ్ముకున్నామని మొదటి దశ ముగిసిందనుకునే సరికే రెండో దశ ముంచుకొచ్చిందని కళాకారులు వాపోతున్నారు.
ముందునుంచే తమకు సరైన గుర్తింపు లేదని.... కొవిడ్ దెబ్బకు ఇక తమను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని దిగులు చెందుతున్నారు. ప్రభుత్వం... గతంలో జిల్లాలవారీగా నాటకాలు ఇచ్చేదని... ఇప్పుడు అదీ లేదని కళాకారులు చెబుతున్నారు. కొవిడ్ క్రమంగా తగ్గుతున్న తరుణంలో తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. క్రమంగా అంతరిస్తున్న నాటకరంగాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు.
ఇదీ చదవండి: