కరోనా వైరస్ అన్ని వయసుల వారి ప్రాణాలను హరిస్తోంది. మహమ్మారి వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు వందలకుపైగా మరణించారు. ఇప్పటికే అనారోగ్యంతో ఉండి.. వైరస్ బారినపడిన వారు సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో నమోదైన మరణాలను పరిశీలిస్తే 49 ఏళ్లలోపు వయస్సున్న వారు 51 మంది ఉన్నారు. మిగిలిన 155 మంది వయస్సు 50 నుంచి 92 ఏళ్ల మధ్య ఉంది. వీరిలో రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారు 90 % మంది ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వీటితోపాటు మూత్రపిండాల సమస్యలు, ఉబ్బసం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ వైరస్ బారినపడి ప్రాణాలు విడిచినవారు 72 మంది ఉన్నారు. మొత్తం మృతుల్లో 49 మంది మహిళలున్నట్లు అధికారిక గణాంకాలు చెపుతున్నాయి.
కరోనాతో మృతిచెందిన వారిలో 50 శాతం మందికి మధుమేహం, రక్తపోటు ఉందని వైద్య అధికారులు చెపుతున్నారు. 12 శాతం కిడ్నీ సంబంధిత రోగులు, 10 శాతం ఆస్తమా, 14 శాతం గుండె సమస్యలు ఉన్నవారు మృత్యువాత పడ్డారు. వైరస్ బాధితుల్లో పురుషులే అధికంగా ఉన్నారని అధికారులు చెపుతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోకపోవడం, చేయించుకున్న తర్వాత ఫలితం ఆలస్యంగా రావడం, ఆసుపత్రిలో చేరడంలో జాప్యం వంటి కారణాల వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండి వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు.