congress leaders fires on ysrcp: రాష్ట్రంలో నియంత పాలన కాకుండా ప్రజాస్వామ్యయుత పాలన అవసరమని.. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. పాత అప్పులు చెల్లించడానికే నిధులు లేక ఇబ్బందులు పడుతూ.. మళ్లీ కొత్త అప్పుల కోసం రిజర్వు బ్యాంకు ముందు మోకరిల్లడం సిగ్గుచేటన్నారు. సంక్షేమ పధకాల అమలు కోసం.. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కోలుకోలేని స్థితికి సీఎం జగన్ తీసుకువచ్చారని మండిపడ్డారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులను అడగలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉండడం శోచనీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న వైకాపా ప్రభుత్వం.. రాష్ట్రంలో ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు.
నవంబరు, డిసెంబరు నెలల్లో ప్రకృతి విపత్తుల కారణంగా.. రాష్ట్రంలో రూ.వందల కోట్ల విలువైన పంటలు, ఉద్యానవనాలు, ఆస్తులు భారీగా దెబ్బతిని దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారని శైలజానాథ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం.. రూ.5 వేల కోట్లుని, తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు ఇవ్వాలని అడిగినా.. కేంద్రం కనికరించలేదని అన్నారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాటలెక్కువ.. చేతలు తక్కువ: తులసిరెడ్డి
రైతుల విషయంలో జగన్ ప్రభుత్వానివి.. మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అన్నట్టుగా ఉందని.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో.. వ్యవసాయ రంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించారని మండిపడ్డారు. ఆ బడ్జెట్ నిధులు సైతం ఖర్చుచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ పథకం కింద ఒకేసారి రూ.8 వేలు ఎగ్గొట్టిందని ధ్వజమెత్తారు. ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి రైతు పండించిన ప్రతి పంట గిట్టుబాటు ధర కల్పిస్తానని చేతులెత్తేసిందన్నారు. జగన్ సర్కార్ రైతుల నోట్లో మట్టి కొట్టిందని మండిపడ్డారు.
ఇదీ చదవండి:
CM Jagan Meet PM Modi: రాష్ట్ర సమస్యలపై.. ప్రధానికి సీఎం జగన్ వినతిపత్రం