రాష్ట్రంలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు(school education committee elections) పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీశాయి. విద్యాకమిటీల ఎన్నికల్లో పలు జిల్లాల్లో ఘర్షణలు(clash between ycp and tdp) చోటు చేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలిలో ఎన్నికలు వాయిదా వేయాలని వైకాపా శ్రేణులు పట్టుబట్టగా... జరిపించాలంటూ తెలుగుదేశం శ్రేణులు డిమాండ్ చేశాయి. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఇరువర్గాలను పోలీసులు(police) చెదరగొట్టారు.
అనంతపురం జిల్లాలో పలుచోట్ల పాఠశాల కమిటీ ఎన్నికల్లో గొడవలు జరిగాయి. శింగనమల మండలం ఇరువెందులలో పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలో ఘర్షణ తలెత్తింది. వైకాపాలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగ్గా..ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఘర్షణ కారణంగా పాఠశాల విద్యా కమిటీ ఎన్నిక వాయిదా పడింది. దయ్యాలకుంటపల్లిలో కమిటీ ఛైర్మన్‌గా తెలుగుదేశం నాయకుడు ఎన్నికవ్వగా... ఎన్నిక పత్రాన్ని వైకాపా సర్పంచ్ చించివేశారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా..భారీగా పోలీసులు మోహరించారు. జలాలపురంలో వైకాపా, తెలుగుదేశం వర్గాల ఘర్షణతో ఎన్నిక వాయిదా(election Postpone) పడింది. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో ఎన్నిక వాయిదా(election Postpone) పడింది. తాము పోటీ చేస్తున్నందునే ఎన్నిక వాయిదా వేశారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపించారు.
కడప జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లి జడ్పీ పాఠశాల, దిగుమ మాదిగపల్లె ప్రాథమిక పాఠశాలలో కోరం ఉన్నప్పటికీ.. ఎన్నికలు వాయిదా వేయాలంటూ ప్రధానోపాధ్యాయులపై వైకాపా నాయకులు, డిజిజన్ స్థాయి పోలీసు అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఎన్నిక వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. వైకాపాలోని రెండు వర్గాల మధ్య గొడవల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. రామాపురం మండలం గువ్వలచెరువులో ప్రాథమమిక పాఠశాల ఎన్నికల్లో వైకాపాలోని రెండు వర్గాలు ఘర్షణకు(clash) దిగాయి. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. కమలాపురం నియోజకవర్గంలోని పెద్దచెప్పలిలో పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్ ఎన్నిక తీవ్రస్థాయి ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం చాపాడులోనూ కమిటీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెంలో ఇద్దరు రాజకీయ నేతల ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు పాఠశాల ఎన్నికల్ని వేదికగా మార్చుకున్నారు. బయటి గ్రామాల నుంచి తమకు తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఎన్నికలకు తీసుకొచ్చినట్లు స్థానికులు ఆరోపించారు. ఎన్నికల్లో పాల్గొనకుండా తమ భర్తల్ని దాచేశారని కొందరు మహిళలు ఆరోపించారు. పోలీసులు రంగంలోకి దిగేసరికి.. కారులో ముగ్గురిని తీసుకురావడంతో రెండు వర్గాలు ఒక్కసారిగా వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లిలో ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. విద్యా కమిటీ ఎన్నిక వాయిదా వేసినట్లు ఎంఈవో తెలిపారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. జరుగుమల్లిలో తల్లిదండ్రులకు, వైకాపా సర్పంచ్‌కు మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు కలగజేసుకుని సర్దిచెప్పారు.
ఇదీ చదవండి