సంక్రాంతి సంబరాల్లో మూడోరోజైన కనుమ నాడు.. గోదావరి, కృష్ణా జిల్లాల్లో జోరుగా కోడిపందేలు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం పరిధిలోని నాలుగు మండలాల్లో కోడి పందేలు, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం, తాళ్ళరేవు మండలాల్లోని గ్రామాలు.. తిరునాళ్లను తలపించాయి. చిన్నా, పెద్ద బరుల్లో కలిపి వెయ్యి నుంచి రూ.50 లక్షల వరకు పందేలు కాస్తున్నారు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లావ్యాప్తంగా పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున కోడి పందేల్లో పాల్గొంటున్నారు. తగ్గేదేలే అన్నట్లుగా పోటీ పడుతున్నారు. నందిగామ నియోజకవర్గంలో.. పెద్దఎత్తున బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు పేకాట, గుండాట నిర్వహిస్తున్నారు. చట్టవ్యతిరేక క్రీడలను కొనసాగిస్తున్నారు. పేకాట ఆడుతూ లక్షలాది రూపాయలు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. చట్టవ్యతిరేక క్రీడలు జరుగుతున్నప్పటికీ.. పోలీసులు శిబిరాల వైపు కన్నెత్తి చూడట్లేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు పెద్ద ఎత్తున మామూళ్లు ముట్టటంతో పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి జిల్లాల్లో..
ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా మూడో రోజు కోడి పందాలు, గుండాటలు, పేకాటలు బాహాటంగా కొనసాగుతున్నాయి. పందెం రాయుళ్లు తమ కోడిపుంజులతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీలు పడుతున్నారు. గడిచిన రెండు రోజుల్లో సుమారు రూ.100 కోట్ల రూపాయలు పైగా చేతులు మారాయని పందెం రాయుళ్లు తెలిపారు. కోడిపందాలతో పాటు ఆయా ప్రాంగణంలో గుండాటలు, కోతాటలు భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. కోడి పందేల కంటే గుండాట పేకాటల లోనే ఎక్కువ సొమ్ము చేతులు మారుతున్నాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: