ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ, ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీపై ఆయన సమీక్షించారు. ధాన్యం సేకరణ, చెల్లింపులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం సేకరించిన తర్వాత 15 రోజుల్లోగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన బిల్లులు పెండింగులో ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్‌కు సంబంధించి నిర్ణీత లక్ష్యం ప్రకారం ధాన్యం సేకరణ జరపాలని సూచించారు. ఇందుకోసం 9వేల260 మొబైల్ యూనిట్లు, అదే సంఖ్యలో అధునాతన తూకం యంత్రాలు, 2.19 కోట్ల నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
నిత్యావసర సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వాహనాలు ఈనెల 3వ వారంలో ప్రారంభించాలని సీఎం జగన్ సూచించారు. అదే రోజున 10 కిలోల బియ్యం బస్తాలు ఆవిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. లక్ష్యానికి మించి ఎస్సీ, బీసీ, మైనార్టీలకు వాహనాలు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, బీసీలకు 3వేల 875.. ఈబీసీలకు 1616, ముస్లింలకు 567, క్రిస్టియన్లకు 85 వాహనాలు ఇవ్వనున్నట్లు వివరించారు. వాహన లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం..10 శాతం లబ్ధిదారుడి వాటాగా చెల్లించనుట్లు తెలిపారు. సంక్షేమ కార్యక్రమంలో భాగంగా, ఆయా కార్పొరేషన్ల ద్వారా వారికి రుణాలు అందించనున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రతి జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా రుణ సదుపాయం కోసం క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఇదీ చదవండి: