రాష్ట్ర సమస్యలే ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి జగన్...ఈ ఉదయం 10 గంటల 40 నిమిషాలకు భేటీ కానున్నారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై... ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీఎం జగన్..ప్రధాని మోదీని ప్రత్యక్షంగా ఈ ఏడాది ఫిబ్రవరి 12న కలిశారు. ఆ తర్వాత కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో... వీడియో సమావేశాల ద్వారా మాట్లాడటం తప్పితే రాష్ట్ర సమస్యలపై ప్రత్యేకంగా కలిసి చర్చించే అవకాశం రాలేదు. దాదాపు 8 నెలల తర్వాత మోదీ, జగన్‌ల మధ్య నేడు సమావేశం జరగనుంది. గత నెల 22న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, 23న జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లను కలిసి వివిధ అంశాలపై జగన్ చర్చించారు.
మరోవైపు...సీఎం జగన్ దిల్లీ పర్యటన నేపథ్యంలో వైకాపా.. కేంద్ర ప్రభుత్వంలో చేరబోతున్నట్లు విస్తృత ప్రచారం సాగుతోంది. భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు వైకాపా వర్గాలు కానీ.... దీన్ని ధ్రువీకరించలేదు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు, పునర్విభజన హామీలను నెరవేరుస్తామంటే ఎన్డీయేలో చేరే విషయమై ఆలోచిస్తామని...వైకాపా సీనియర్ నేత, ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి పీటీఐతో చెప్పారు. కూటమిలో చేరేందుకు ఎన్డీయే నుంచి ఆహ్వానం కానీ, వైకాపా నుంచి ప్రతిపాదన కానీ లేవని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన అభివృద్ధి పరమైన అంశాలే మోదీ, జగన్‌ల సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చకు రానున్నట్లు చెప్పారు. ఎన్డీయేలో చేరే అవకాశం లేదని వైకాపా ఎంపీలు పేర్కొన్నారు.
ఇదీచదవండి