రాష్ట్రవ్యాప్తంగా 134 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారు. యాభై, అంతకన్నా ఎక్కువ పడకలున్న ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబరు నాటికి 97 ప్లాంట్లు, వచ్చే మార్చి నాటికి మిగిలిన 37 పూర్తి చేస్తామని వెల్లడించారు. కొవిడ్ నియంత్రణపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ప్రభుత్వాసుపత్రుల్లో వినియోగించే మందులన్నీ జీఎంపీ(ఉత్తమ ఉత్పత్తి ప్రమాణాలు), ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లోనూ ఇవే మందులుండాలని స్పష్టంచేశారు. జిల్లాల్లో ఆరోగ్య కూడళ్ల(హెల్త్ హబ్స్)కు సమకూర్చే స్థలాలు ప్రజల ఆవాసాలకు దగ్గరలోనే ఉండేలా చూడాలని సూచించారు. అప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారని పేర్కొన్నారు.
ఆరోగ్య రంగం బలోపేతం...
‘‘కొత్తగా ఏర్పాటవుతున్న 16 బోధనాసుపత్రులు, ఆధునీకరిస్తున్న 11 పాత బోధనాసుపత్రులు, ఆరోగ్య కూడళ్లతో రాష్ట్రంలో ఆరోగ్య రంగం బలోపేతమవుతుంది. ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వాటి నిర్వహణకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. రోగులకు మెరుగైన సేవలతోపాటు మంచి ఆహారం అందివ్వాలి. 21 రోజుల్లోగా ఆరోగ్యశ్రీ, 104, 108 బిల్లులు చెల్లించాలి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆసుపత్రి భవనాలు, వైద్య పరికరాల నిర్వహణ అత్యుత్తమంగా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌వోపీ) తయారు చేయండి. నర్సులు, వైద్యులు, ఇతర సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ ఉంచేందుకు ప్రత్యేకాధికారిని నియమించాలి’’ అని సీఎం ఆదేశించారు.
క్యాన్సర్, గుండె జబ్బులు, చిన్నారుల శస్త్రచికిత్సల కోసం ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు అధికంగా వెళ్తున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ వ్యాధులకు జిల్లాల్లోని హెల్త్ హబ్స్‌లో చికిత్స అందేలా ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కొవిడ్ కేసుల వివరాలను ముఖ్యమంత్రికి అందించారు.
కొవిడ్ కేసులు తగ్గుతున్నాయి
రాష్ట్రంలో కొవిడ్ (covid) యాక్టివ్ కేసులు 50 వేల దిగువకు చేరినట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. పాజిటివిటీ రేటు 5.23 శాతం ఉన్నట్లు తెలిపారు. 3,148 బ్లాక్‌ఫంగస్ కేసులు వస్తే 1,095 మందికి శస్త్రచికిత్స చేసినట్లు అధికారులు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ వల్ల ఇప్పటివరకు 237 మంది మరణించినట్లు సీఎంకు వివరించారు.
ఇదీచదవండి
Delta pluse case: తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు నిర్ధారణ..: ఆళ్ల నాని