లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలు సమయాన్ని ప్రభుత్వం కుదించింది. పట్టణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే అనుమతించాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు యథావిధిగా కొనసాగించనుంది. ఈ మేరకు అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి అమ్మే వారిని జైలుకు పంపాలని సూచించారు. ప్రతి దుకాణంవద్ద ధరల పట్టికను ప్రదర్శించేలా చూడాలని, వాటిపై విస్తృత ప్రచారం చేయాలని స్పష్టం చేశారు.
పట్టణాలపై దృష్టి
కొవిడ్-19 ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎం సమీక్షించారు. మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, సుచరిత, కన్నబాబు, రాజేంద్రనాథ్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు హాజరయ్యారు. కరోనా విస్తరణ, నివారణ చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలను తెలిపారు. ఎరువులు, విత్తనాల రవాణా నిలిచిపోకుండా చూస్తున్నామని, ఎక్కడికక్కడ నిల్వ చేస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ వివరించారు. ప్రతి జిల్లాలో సమీకృత సేవా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.
సామాజిక దూరం పాటిస్తూనే.. వ్యవసాయ పనులు
కొవిడ్ నివారణ చర్యలపై సమన్వయం కోసం జిల్లా స్థాయిలో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలను నిర్వహించాలని సీఎం సూచించారు. సామాజిక దూరం పాటిస్తూనే.. వ్యవసాయ పనులు, ఆహారశుద్ధి యూనిట్లలో కార్యకలాపాలను కొనసాగించేలా చూడాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.
- నగరాలు, పట్టణాల్లో ప్రభావిత ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి.
- నిత్యావసర వస్తువుల ధరలపై టీవీలు, పత్రికల్లో విస్తృత ప్రచారం చేయాలి.
- ప్రతి దుకాణం, సూపర్ మార్కెట్‌వద్ద ధరల పట్టిక, సేవాకేంద్రం ఫోన్ నంబరు ఉండాలి.
- రేషన్ దుకాణాలవద్ద ఒకే వరుస కాకుండా సామాజిక దూరం పాటించేలా 3కు మించి వరుసలు ఉండాలి.
- అత్యవసర సర్వీసులు, సరకు రవాణాకు అంతరాయం లేకుండా చూడాలి.
- మొబైల్ వ్యాన్ల ద్వారా కూరగాయలు, నిత్యావసరాల అమ్మకాన్ని ప్రోత్సహించాలి.
- ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యావసరాల పంపిణీపై ఆలోచించాలి.
- వృద్ధాశ్రమాలకు అవసరమైన నిత్యావసరాలను సరఫరా చేయాలి.
- ఆక్వా పరిశ్రమలను నడిపించడంలో గ్రామ వాలంటీర్లను భాగస్వాములను చేయాలి.
- రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి.
- నిత్యావసరాల కొరత లేకుండా అవసరమైన వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలి.
- గ్రామ వాలంటీర్ల సర్వే పటిష్ఠంగా ఉండాలి. ప్రతి కుటుంబ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి.
- వలస కూలీలు, కార్మికుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్లలో మెనూ ప్రకారం భోజనం అందించాలి.
ఇవీ చదవండి: