రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ సహా మెరుగైన వైద్య సేవలందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కొవిడ్ నివారణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు పని చేసే మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా నిర్ధేశిత రుసుం కంటే ఎక్కువ వసూలు చేయకుండా కట్టడి చేయవచ్చని ఆదేశాల్లో పేర్కొంది.
మూడంచెల వ్యవస్థ పనితీరు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జిల్లాలో కొవిడ్ ఆస్పత్రులన్నింటిని కలెక్టర్ క్లస్టర్లుగా విభజిస్తారు. ప్రతి క్లస్టర్‌లో 5 నుంచి 8 ఆస్పత్రులు ఉంటాయి. ఒక్కో క్లస్టర్‌కు జిల్లా స్థాయి అధికారిని ఇంఛార్జ్‌గా జిల్లా కలెక్టర్ నియమిస్తారు. తరుచూ ఆ ఆస్పత్రులను సందర్శించే ఆ అధికారి, వాటిపై నిఘా ఉంచుతారు. ఏ ప్రైవేటు ఆస్పత్రిలో కూడా నిర్దేశించిన ఫీజుల కన్నా ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా చూస్తారు. ఎక్కడ ఏ ఫిర్యాదు వచ్చినా వేగంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అదే విధంగా ఆ క్లస్టర్ పరిధిలో అనుమతి లేకుండా కొవిడ్ చికిత్స చేసే ఆస్పత్రులపైనా అధికారి చర్యలు తీసుకుంటారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజలు వసూలు చేయకుండా నియంత్రించడం కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తారు. అందులో ఔషధ నియంత్రణ విభాగం అధికారితో పాటు, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నుంచి ఒకరు, వైద్య ఆరోగ్య శాఖ నుంచి మరొక అధికారి సభ్యులుగా ఉంటారు. కాగా.. జేసీ(అభివృద్ధి)లకు కొవిడ్ కట్టడి చర్యలపై పూర్తి అధికారాలు కట్టబెట్టారు.
ప్రత్యేక టాస్క్‌పోర్స్ కమిటీ
జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న క్లస్టర్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్‌ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడం కోసం రాష్ట్ర స్థాయిలో సీనియర్ అధికారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీలో రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఛైర్‌పర్సన్ డాక్టర్ కేఎస్. జవహర్‌రెడ్డి, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ రవిశంకర్ సభ్యులుగా ఉన్నారు.
ఆసుపత్రుల తీరుపై నిఘా
ఆస్పత్రుల్లో శానిటేషన్, నాణ్యమైన ఆహారం, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు, ఆరోగ్యమిత్రల విధులు, సీసీ టీవీ కెమెరాల ద్వారా ఆరోగ్యమిత్రల పనితీరుపై నిఘా వేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాల్‌సెంటర్‌తో అనుసంధానం చేసుకుని.., రోగులకు సంబంధించిన సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు చేరవేయాలని స్పష్టం చేశారు. డేటా అప్‌డేషన్‌తో సహా, ఆస్పత్రుల మేనేజ్‌మెంట్ బాధ్యతను జేసీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీచదవండి: 2023 మార్చి నాటికి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్: సీఎం జగన్