దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివిధ సంస్థల వ్యవస్థాపకులు, సీఈవోలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. విశాఖను స్టార్టప్ హబ్‌గా మారుస్తామని స్టార్టప్ సంస్థల ప్రతినిధులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. విధానపరమైన నిర్ణయాలతో పాటు స్టార్టప్‌ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఏపీలో విద్యారంగంలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నామని బైజూస్ సంస్థ ఉపాధ్యక్షుడు సుష్మిత్ సర్కార్ తెలిపినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. బైజూస్ పాఠ్యప్రణాళికను కూడా ఏపీ విద్యార్ధులకు అందించేందుకు ముందుకు వచ్చినట్లు స్పష్టం చేశాయి.
మరోవైపు ఏపీలో చేపట్టిన సమగ్ర భూసర్వే రికార్డులను డిజిటల్‌గా భద్రపరిచేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కాయిన్ స్విచ్ క్యూబర్ సంస్థ ముందుకొచ్చినట్లు సీఎంవో తెలిపింది. ఏపీ పర్యటకాభివృద్ధితో పాటు పర్యటక స్థలాలకు గుర్తింపు వచ్చేలా సహకారం అందిస్తామని ఈజ్ మైట్రిప్ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంకు వివరించినట్టు స్పష్టం చేసింది.
పలు అంశాల్లో సహకారం
* రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి అవసరమైన సహకారాన్ని అందిస్తామని బైజూస్ ఉపాధ్యక్షురాలు (పబ్లిక్ పాలసీ) సుష్మిత సర్కార్ వెల్లడించారు. ఏపీ విద్యకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బైజూస్ సీఈవో బైజూ రవీంద్రన్ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు.
* సమగ్ర భూ సర్వే, రికార్డులను భద్రపరిచే సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి అందించే విషయమై కాయిన్‌స్విచ్ క్యూబర్ కంపెనీ వ్యవస్థాపకులు, గ్రూపు ముఖ్య ఎగ్జిక్యూటివ్ అధికారి ఆశిష్ సింఘాల్‌తో చర్చించారు. సమగ్ర భూ సర్వే రికార్డులను నిక్షిప్తం చేయడంలో ప్రభుత్వానికి సహకరించడానికి అంగీకరించారు.
* రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన సూచనలపై ఈజ్‌మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిత్తీతో చర్చించారు.
* స్విట్జర్లాండ్‌లోని ప్రవాసాంధ్రులు జగన్‌ను కలిశారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో చక్కటి కృషి జరుగుతోందన్నారు.
* మీ షో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రేయ, కొర్‌సెరా ఉపాధ్యక్షుడు కెవిన్ మిల్స్, వీహివ్‌ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్ సీఎంను కలిసి వివిధ అంశాలపై చర్చించారు.
* స్విట్జర్లాండ్‌లో లూజర్న్ సమీపంలోని షిండ్లర్ శిక్షణ కేంద్రాన్ని సీఎం జగన్ బుధవారం సందర్శించారు. ఇక్కడ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. నైపుణ్యాభివృద్ధికి సంబంధించి శిక్షణలో ఉన్న విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. అక్కడ ఉన్న 1929 నాటి లిఫ్ట్‌లో ప్రయాణించారు.
ఇవీ చూడండి