CBN in Women's Day Celebrations: చెల్లికే న్యాయం చేయలేని జగన్‌మోహన్‌రెడ్డి... రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తారా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుమహిళ ఆధ్వర్యంలో మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పలువురు మహిళలను సత్కరించారు. మూడేళ్లుగా వివిధ సంఘటనల్లో బలైన మహిళల చిత్రపటాలకు నివాళి అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ హయాంలోనే మొదటిసారి రాజకీయాల్లో మహిళలకు గౌరవం కల్పించారు. ఆస్తిలోనూ సమాన హక్కు తెచ్చారు’ అని కొనియాడారు. ‘మేం స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్లు ఇచ్చాం. డ్వాక్రా సంఘాల ద్వారా 90 లక్షల మంది మహిళల్ని ఒకే గొడుగు కిందకు తెచ్చాం. ఆడబిడ్డలకు కళాశాలల్లో, ఉద్యోగాల్లో 33%, ఉపాధ్యాయ ఉద్యోగాల్లో 40% రిజర్వేషన్లు కల్పించాం. చట్టసభల్లోనూ మహిళలకు 33% రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాడతాం’ అని హామీ ఇచ్చారు.
పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత
తనపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు భయపడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి... త్వరలో ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆయన్ని ఎప్పుడు వదిలించుకుందామా? అని ప్రజలూ ఎదురు చూస్తున్నారు’ అని చంద్రబాబు అన్నారు. ‘బాబాóుని చంపించినందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చెల్లికి క్షమాపణ చెబితే.. ప్రజలు క్షమిస్తారు’ అని సూచించారు. ‘వివేకా హత్య కేసులో ఒక్కో వాంగ్మూలం భయానకంగా ఉంది. పైగా సీబీఐ పైనే దాడి చేస్తున్నారు. ఇలాంటి సీఎంని ఏమనాలి’ అని నిలదీశారు. భూకబ్జాను అడ్డుకున్నందుకు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్ద అన్నలూరులో వెంకటసుబ్బమ్మను పోలీసుల సాయంతో వైకాపా నేతలు అవమానించారని చంద్రబాబు మండిపడ్డారు.
మహిళల వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్న జగన్ ప్రభుత్వం
మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, సామాజిక మాధ్యమాల్లోనూ ఇష్టానుసారంగా రాయిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఏనాడూ రాజకీయాలపై మాట్లాడని నా భార్య వ్యక్తిత్వాన్ని తప్పు పట్టారు. అసెంబ్లీలో కౌరవ సభ పోయి.. గౌరవ సభ వచ్చే వరకు అడుగు పెట్టనని శపథం చేశాను. క్షేత్రస్థాయిలో గెలిచాకే అక్కడ అడుగుపెడతా’ అని పునరుద్ఘాటించారు.
కోన వెంకటరావు కుటుంబాన్ని ఆదుకుంటాం
శ్రీకాకుళం జిల్లాలో తెదేపా కార్యకర్త వెంకటరావు ఆత్మహత్యకు మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌లే కారణమని చంద్రబాబు ఆరోపించారు. ‘వెంకటరావు ఇద్దరు కుమార్తెలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తాం. వారి కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందిస్తాం’ అని హామీ ఇచ్చారు.
నాడు ఐటీ ఉద్యోగాలు.. నేడు మరుగుదొడ్ల దగ్గర వసూలు
తెదేపా హయాంలో యువతకు ఐటీ ఉద్యోగాలు వచ్చేలా చేస్తే... జగన్‌రెడ్డి వచ్చాక మరుగుదొడ్ల దగ్గర డబ్బు వసూలు చేసే ఉద్యోగాలిచ్చారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పిల్లలను బాగా చదివించి మటన్, చికెన్ దుకాణాల్లో ఉద్యోగాలకు పెట్టాలా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ, గద్దె అనూరాధ తదితరులు పాల్గొన్నారు.
మూడేళ్ల వైకాపా పాలనలో మహిళలపై 1,500పైగా దాడులు, అత్యాచారాలు జరిగాయి. సీఎం ఇంటి సమీపంలోనే యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదు. విశాఖ, విజయవాడ, నరసరావుపేట, అనంతపురం, పులివెందుల, నెల్లూరు తదితర ప్రాంతాల్లో మహిళలపై జరిగిన అత్యాచారాలు, దాడులపై చర్యలే లేవు. గుంటూరు జిల్లాలో భర్త ఎదుటే భార్యపై అత్యాచారం చేసిన ఘటనకు ప్రభుత్వం సిగ్గు పడాలి. - అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు
ఇదీ చదవండి : CM Jagan: మహిళలకు 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే: సీఎం జగన్