Chiranjeevi On Political Re-Entry: పొలిటికల్ రీ ఎంట్రీపై సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్త ఊహాజనితమని కొట్టిపారేశారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ వచ్చిన వార్తలను మెగాస్టార్ ఖండించారు. అలాంటి ఆఫర్లేవీ తన వద్దకు రావని.., తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యానని చిరంజీవి స్పష్టం చేశారు. అలాంటి ఆఫర్లకు తాను అతీతమని, వాటికి లోబడే వ్యక్తిని కాదని చెప్పారు. పదవులు కోరుకోవడం తన అభిమతం కాదని అన్నారు.
సంక్రాంతి వేడుకల కోసం కృష్ణా జిల్లా డోకిపర్రు వెళుతున్న చిరంజీవిని.. రాజ్యసభ సీటు గురించి ప్రశ్నించగా ఈ మేరకు స్పందించారు. డోకిపర్రులో ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో గోదాదేవి కళ్యాణోత్సవానికి చిరు హాజయ్యారు.
"నాకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమే. రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలను ఖండిస్తున్నా. అలాంటి ఆఫర్లు ఏవీ నా వద్దకు రావు. రాజకీయాలకు నేను పూర్తిగా దూరం. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు ఎవరూ ఆఫర్లు ఇవ్వరు. అలాంటి ఆఫర్లకు లోబడే వ్యక్తిని కాదు. పదవులు కోరుకోవడం నా అభిమతం కాదు." - చిరంజీవి
సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి నిన్న మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. దీంతో చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది.