అత్యంత ఆందోళనకరంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మేధావులు ఇప్పటికైనా స్పందించాలని.. అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం(CA's Association on financial emergency in AP) అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులు మూల వ్యయాలకి కాకుండా.. రోజువారీ ఖర్చులకు వాడటం, అప్పులు చెల్లించడానికి తిరిగి అప్పులు చేస్తోందన్నారు. ఇంకా అప్పులు తీసుకునే పరిధి పెంచే వెసులు బాటు కోసం చట్టాలను సవరించడం ఆందోళనను కలిగిస్తోందని అన్నారు.
సంక్షేమ పథకాలతో భావితరాలకు అప్పులు..
ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే భావితరాలకు ఆస్తులు ఇవ్వడం అటుంచితే.. మోయలేని అప్పుల భారాన్ని ఇస్తున్నట్టుగా ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకే సమావేశం నిర్వహించినట్లు ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం సభ్యులు స్పష్టం చేశారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలను గాలికొదిలేసి, ఇష్టానుసారంగా అప్పులు చేయడం వల్ల రాష్ట్రం దివాళా దిశగా పోతోందని(AP Financial situation going into insolvency) చెప్పారు. దివాళా వైపు పయనిస్తున్న రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా? అని ప్రశ్నించారు. పెట్టుబడులు లేకపోతెే నిరుద్యోగం పెరిగి యువత ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుందన్నారు. సంక్షేమ పథకాలపై ముందు ప్రజల్లో మార్పు రావాలని.. అప్పుచేసి సంక్షేమ పథకాలు నిర్వహించడం వల్ల ఆ భారం రానున్న కాలంలో భావితరాలపైనే పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
Diverted Panchayat Funds: ఇదేం సర్దు'పోటు' ?.. 5 నెలల్లో రూ.1,245 కోట్లు మళ్లింపు