రాష్ట్రంలో 8, 9, 10వ తరగతి పాఠ్యాంశాల్లో మార్పు చేసే యోచనలో ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. సీబీఎస్ఈ (CBSE) ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశాల రూపకల్పన చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులతో పాఠ్యాంశాల మార్పుపై సచివాలయంలో ప్రాథమిక స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
పాఠ్యాంశాల మార్పునకు సంబంధించిన బాధ్యతల్ని రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 130 మంది ఉపాధ్యాయులకు అప్పగించారు. కొత్త పాఠ్యాంశాల ద్వారా ప్రభుత్వ భావజాలం, ముఖ్యమంత్రి జగన్ ఆలోచనా విధానం ప్రతిబింబించేలా చూడాలని మంత్రి సురేశ్ ఉపాధ్యాయులకు సూచించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అమ్మ ఒడి పథకం తోడ్పడుతోందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలకూ సమాన విద్యావకాశాలు ఉండాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 2020 జాతీయ విద్యా విధానం కంటే ముందే..మార్పులపై సీఎం జగన్ ఆలోచన చేశారన్నారు. అందుకే అధికారంలోకి రాగానే విద్యా రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు.
ఇదీ చదవండి