ఇసుక రీచ్‌లను సబ్‌లీజ్‌కు ఇప్పిస్తానని నమ్మించి రూ.2 కోట్లు వసూలు చేసిన మోసగాడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఐఏఎస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీపత్రాలతో మోసగిస్తున్నట్లు తేలడంతో పోలీసులు అతణ్ని శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలను నగర డీసీపీ-2 విక్రాంత్ పాటిల్ విలేకర్లకు వెల్లడించారు. ‘విజయవాడ శివారు గొల్లపూడి మైలురాయి సెంటరులో ర్యాంపుల నుంచి ఇసుక తవ్వేందుకు కూలీలు, యంత్రాలు కావాలంటూ కొందరు వాకబు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు చెందిన ఫైనాన్స్ మేనేజర్ విశ్వనాథ సతీష్‌కు అనుమానం వచ్చి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుధాకర్ ఇన్‌ఫ్రాటెక్ ప్రతినిధులుగా చెప్పుకుంటున్న కొప్పరపురి ప్రవీణ్‌కుమార్, మల్లంపల్లి శ్రీనివాసరావు, ముక్కొల్లు నాగమల్లేశ్వరరావులను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు రాష్ట్రంలోని రీచ్‌ల నుంచి ఇసుక తవ్వుకునేందుకు జై ప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ నుంచి మూడేళ్లకు సబ్‌లీజు పొందినట్లు గనులశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంతకంతో ఉన్న పత్రాలను చూపించారు. జై ప్రకాశ్ పవర్ వెంచర్స్ డైరెక్టర్ పి.గంగాధర్‌శాస్త్రి నాలుగు జిల్లాల్లో ఇసుక తవ్వకాలను కేటాయించినట్లున్న పత్రం, సుధాకర్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థను సబ్‌లీజు సంస్థగా ప్రభుత్వం గుర్తించినట్లు గోపాలకృష్ణ ద్వివేది సంతకంతో ఉన్న మరో పత్రాన్నీ చూపారు. అవి నకిలీవని తేలడంతో ఈ పత్రాలిచ్చిన కనుకుర్తి చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మోసం కేసులో జైలుకెళ్లి..
తూర్పుగోదావరి జిల్లా కరప మండలం నడకుదురు గ్రామానికి చెందిన కనుకుర్తి రామకృష్ణ చంద్రశేఖర్ హైదరాబాద్‌లో ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు. ఆ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నట్లుగా అక్కడి ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు సంతకాన్ని ఫోర్జరీ చేసి పత్రాలను సృష్టించాడు. దీనిపై 2018లో సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో శిక్ష అనుభవించి బయటికొచ్చిన రామకృష్ణ తిరిగి మోసాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన లోకాభిరాముడుతో పరిచయం పెంచుకున్నాడు. ఇసుక సబ్‌కాంట్రాక్ట్ చేయాలన్న ఆసక్తితో హైదరాబాద్‌కు చెందిన సురేంద్రనాథ్, తిరుమలరెడ్డి.. లోకాభిరాముడి ద్వారా చంద్రశేఖర్‌ను కలుసుకున్నారు. చంద్రశేఖర్ మాటలు నమ్మి ఇసుక కాంట్రాక్ట్‌ల కోసం సురేంద్రనాథ్ రూ.1.4 కోట్లు, తిరుమలరెడ్డి రూ.60 లక్షలు అతని ఖాతాలో వేశారు. అతను వారికి నకిలీపత్రాలు తయారు చేసి ఇచ్చాడు. ఇవి అసలైనవని నమ్మి వీరు పోలీసులకు పట్టుబడ్డారు. చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసిన భవానీపురం పోలీసులు.. అతని బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.2 కోట్లను నిలుపుదల చేయించారు. ల్యాప్‌టాప్, 2 నకిలీ స్టాంపులు, రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి సంతకమూ ఫోర్జరీ
విశాఖ ఉక్కు కర్మాగారంలో ఏజీఎం హోదాలో ఉన్న లోకాభిరాముడికి చంద్రశేఖర్ రైల్లో పరిచయమయ్యాడు. తాను ఐప్యాక్‌లో పనిచేస్తున్నానని, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వ్యవహారాలను చూస్తున్నానని నమ్మించాడు. పార్టీకి బాగా పనిచేస్తున్నావని సీఎం తనకు జగన్ ప్రశంసాపత్రం ఇచ్చినట్లు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి రూపొందించిన పత్రాన్ని చూపించాడు. సీఎం పేషీలో సలహాదారు పదవి ఇస్తానని, మీ అబ్బాయికి సాగర్‌మాల ప్రాజెక్టులో ఉద్యోగమిస్తానని నమ్మించాడు. ఇవన్నీ నమ్మిన లోకాభిరాముడు ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. రూ.25 లక్షలు చంద్రశేఖర్‌కు ఇచ్చారు. తర్వాత చంద్రశేఖర్.. సీఎం పేషీలో సలహాదారు పదవిని లోకాభిరాముడికి ఇచ్చినట్లు ముఖ్యమంత్రి ఓఎస్డీ నకిలీ సంతకంతో ఉన్న లేఖను అందజేశాడు. అంతేకాదు రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. లోకాభిరాముడికి విశాఖపట్నంలో ప్రభుత్వం నాలుగెకరాలు ఇచ్చినట్లు పత్రాలు సృష్టించి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్థలానికి ఇటీవల కొలతలు కూడా పెట్టించినట్లు సమాచారం.
ఇదీచదవండి.