Chandrababu on Telugu students at Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం తెదేపా ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిలోని వంద మంది తెలుగు విద్యార్థులతో జూమ్ ద్వారా శుక్రవారం ఆయన మాట్లాడారు. పాస్‌పోర్ట్ సహా ఇతర ఆధారాలను వెంటే ఉంచుకోవాలని, ఒకరికొకరు పరస్పర సహాయ, సహకారాలు అందించుకోవాలని సూచించారు. సమస్యపై భారత విదేశాంగ మంత్రితో మాట్లాడతానని, ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు స్థానిక పరిస్థితులను చంద్రబాబుకు వివరించారు. ‘‘మా వద్ద రెండు రోజులకు సరిపోయే ఆహారం మాత్రమే ఉంది. బాంబుదాడుల కారణంగా మెట్రోస్టేషన్‌లో ఇరుక్కు పోయాం’’ అని కొందరు అక్కడి పరిస్థితులను వీడియోకాల్ ద్వారా చంద్రబాబుకు చూపించారు. పోలెండ్, హంగేరీ సరిహద్దులకు వెళ్లేందుకు తాము ప్రయత్నిస్తున్నా, వాహనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఉక్రెయిన్‌లో ఉన్న ఇతర దేశాల యువతనూ సైన్యంలోకి రమ్మని ఆ దేశ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కొందరు ఆందోళన వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌లో స్థిరపడ్డ కుమార్, దివ్యారాజ్‌లు బాధిత విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
విదేశాంగ మంత్రికి చంద్రబాబు ఫోన్
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల్ని స్వదేశానికి తరలించాలని విదేశాంగ శాఖ మంత్రి జయ్‌శంకర్‌ను తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈమేరకు శుక్రవారం ఫోన్‌లో ఆయనతో మాట్లాడారు. ‘‘యుద్ధంతో ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు బాధితులతో నేను జూమ్‌లో మాట్లాడా. అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి’’ అని వివరించారు. తెలుగు విద్యార్థుల వివరాల్ని తన కార్యాలయానికి తెలియజేయాలని జయ్‌శంకర్ చెప్పినట్లు తెదేపా కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే... ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయ్‌శంకర్‌కు లేఖ రాశారు.
ఉక్రెయిన్‌లోని తెలుగువారికి ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెల్ మద్దతు: లోకేశ్
Nara Lokesh on Telugu students at Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగువారందరికీ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెల్ మద్దతు ఇస్తుందని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని తెలుగువారు ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెల్ హెల్ప్‌లైన్ నెంబర్ +91 8645350888కి కాల్, nritdpservices@gmail.comకు ఈ మెయిల్ చేయవచ్చని తెలిపారు.
లేదా.. పేరు, ఫోను నంబరు, ఉక్రెయిన్ చిరునామా, పాస్‌పోర్టు వివరాలు, భారతదేశంలోని తల్లిదండ్రుల సంప్రదింపు వివరాలను +91 8950674837కు Whatsapp చేయవచ్చన్నారు. ఈ సందేశాన్ని ఉక్రెయిన్‌లో నివసిస్తున్న తెలుగు వారందరికీ షేర్ చేయాలని కోరారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని లోకేశ్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: