Chandrababu Tour in jangareddygudem: తెదేపా అధినేత చంద్రబాబు.. నేడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కలకలం రేపిన నాటుసారా మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన విమర్శించారు. కల్తీసారా కారణంగా.. బాధితులు చనిపోతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించిన చంద్రబాబు.. ప్రాణాలు పోతున్నా స్పందించరా అని మండిపడ్డారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా చర్యలు లేవని ధ్వజమెత్తారు. మరణాలపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న భయాందోళనలను పోగొట్టాలని హితవు పలికారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని చంద్రబాబు సూచించారు.
18కి చేరిన మృతుల సంఖ్య..
Death Toll in Jangareddygudem:పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు భయపెడుతూనే ఉన్నాయి. శనివారం మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించడంతో నాలుగు రోజుల వ్యవధిలో మృతుల సంఖ్య 18కి చేరింది. సారా తాగే అలవాటున్న నలుగురు అనారోగ్య కారణాలతో ఉదయం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వీరిలో ఉప్పలమెట్టకు చెందిన వెంపల అనిల్ కుమార్ (35), గౌరీశంకరపురానికి చెందిన సునాని ఉపేంద్ర (30) గంటన్నరలోనే కన్నుమూశారు. మృతుడు అనిల్ సోదరుడు సర్వేశ్వరరావు, మరొకరు బొల్లా నేతాజీల ఆరోగ్యం నిలకడగా ఉంది.
తెదేపావి శవ రాజకీయాలు: మంత్రి ఆళ్ల నాని
నాటు సారా కలకలం వెనుక రాజకీయ కారణాలున్నాయని మంత్రి ఆళ్ల నాని వివరించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఆయన బాధితులను పరామర్శించారు. వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందిన వారి కుటుంబీకులకు పరిహారం వస్తుందని తెదేపా నాయకులు ప్రలోభపెట్టి ఇదంతా చేయిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రేపోమాపో ఇక్కడికి చంద్రబాబు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.
‘ఆసుపత్రుల రికార్డుల ప్రకారం జంగారెడ్డిగూడెంలో వారం రోజులుగా మరణించిన వారి సంఖ్య ఐదు. వారిలో ఒకరు గుండెపోటుతో మరణించగా.. మిగిలిన నలుగురు అతిగా మద్యం తాగడంతో చనిపోయారు. వివిధ కారణాలతో ఇళ్లవద్ద చనిపోతున్న వారి మరణాలపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా తెదేపావారు శవ రాజకీయాలు చేస్తున్నారు. అప్పారావు అనే వ్యక్తి అంత్యక్రియలు పూర్తయ్యాక ఆయన కుటుంబీకులకు ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందంటూ ఆశ పెట్టి ఫిర్యాదు చేయించారు. సమస్యకు కారణాలు తెలుసుకునేందుకు పోస్టుమార్టం చేయిస్తాం’ అని తెలిపారు.
మరణాలపై ప్రభుత్వం నోరు విప్పదా: సోము వీర్రాజు
జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి ధనదాహమే కారణం: అనిత
మహిళల ఆగ్రహానికి గురికాకముందే.. మద్యం వ్యాపారాన్ని, గంజాయి, నాటుసారా విక్రయాలను ముఖ్యమంత్రి కట్టడిచేస్తే మంచిదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఘటనకు ముఖ్యమంత్రి ధనదాహామే కారణమని ఆమె ఆరోపించారు. వాలంటీర్లు, వైకాపా నేతలే నాటుసారా, గంజాయి విక్రయాలుసాగిస్తుంటే, సీఎం ఎందుకు నిరోధించడంలేదని మండిపడ్డారు. మద్యం అమ్మకాలతో ఆదాయం పెంచుకోవడంపై చూపుతున్న శ్రధ్ధలో సగమైనా ముఖ్యమంత్రి మహిళల మానప్రాణాలపై చూపితే బాగుంటుందని అనిత హితవు పలికారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? - చంద్రబాబు