Chandrababu on Budget: కేంద్రం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ ఆశాజనకంగా లేదని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రైతులకు ఈ బడ్జెట్ ద్వారా ఎటువంటి మేలు జరగదన్నారు. పంటలకు మద్దతు ధర విషయంలో.. ఎలాంటి సానుకూల నిర్ణయాలు లేవకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పేద వర్గాలు, కొవిడ్‌తో దెబ్బతిన్న రంగాలకు ఎలాంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్లో చెప్పలేదని అన్నారు. జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చెయ్యడం సరికాదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో.. వాటిని తగ్గించేందుకు ఎలాంటి చర్యలను ప్రకటించకపోవడాన్ని తప్పు పట్టారు.
నదుల అనుసంధానంపై..
సంస్కరణలు, నదుల అనుసంధానం విషయంలో కేంద్రం తీసుకున్న కొన్ని నిర్ణయాలను చంద్రబాబు స్వాగతించారు. తెదేపా హయాంలో కృష్ణా - గోదావరి నదుల అనుసంధానం చేయడం ద్వారా 7 ఏళ్ల క్రితమే ఈ ప్రక్రియకు నాంది పలికామని అన్నారు. ఇప్పటికైనా నదుల అనుసంధానంపై కేంద్రం ముందడుగు వేయటంపై ఆనందం వ్యక్తం చేశారు.
విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని చంద్రబాబు ఆహ్వానించారు. గతంలో దేశంలో మొట్టమొదటి సారిగా ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీని తెచ్చామన్నారు. డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ కరెన్సీ విషయంలో కేంద్ర ప్రతిపాదనలు మంచి నిర్ణయాలని అన్నారు. సోలార్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ముందుకు రావడం సముచితమన్నారు.
వైకాపా పూర్తిగా విఫలమైంది
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైకాపా ప్రభుత్వం మరోసారి పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. 28 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని నిలదీశారు. ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో.. సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వైకాపా ఎంపీలకు సొంత ప్రయోజనాలపై తప్ప..రాష్ట్ర ప్రయోజనాలపై శ్రద్ద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP PRC GOs: అసలు విషయాలు వదిలి.. పీఆర్సీ నివేదికనే ఎందుకు కోరుతున్నారు?: సజ్జల