తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17 నుంచి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. అదే రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. తిరుపతిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం ఎన్టీఆర్ భవన్లో తిరుపతి ఉప ఎన్నికపై కమిటీ సభ్యులతో అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 70 క్లస్టర్లను ఏర్పాటు చేసుకుని ప్రతి క్లస్టర్‌కు ఒక సీనియర్ నేతను ఇంఛార్జ్‌గా నియమించాలన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
పార్టీని పట్టించుకోకుంటే కఠిన నిర్ణయాలకు వెనుకాడబోనని చంద్రబాబు నియోజకవర్గ ఇంఛార్జ్‌లను హెచ్చరించారు. ఎన్టీఆర్ భవన్లో పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం.. 16 శాసనసభ నియోజకవర్గాల్లో బాధ్యులను నియమించాల్సి ఉండగా.. మరో 31 శాసనసభ నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లు సమర్థవంతగా పనిచేయట్లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 47 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సంబంధిత పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను ఆయన ఆదేశించారు.
ఉప ఎన్నిక ప్రచారంపై ప్రణాళికలు
అంతకు ముందు విజయవాడలోని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాసంలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికపై తెదేపా కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ప్రతి పది పోలింగ్ కేంద్రాలకు ఓ ఇంఛార్జ్ చొప్పున నియమించుకోవాలని తెదేపా నిర్ణయించింది. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇతర ప్రాంతాల నుంచి ఇంఛార్జ్‌లను ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. నేతలంతా ప్రచారంతో పాటు గ్రామ పర్యటనలు చేయాలని నిర్ణయించారు. నియమించిన నియోజకవర్గాల్లోనే నేతలు బసచేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్ర స్థాయి సమాచారాన్ని అధిష్టానానికి పంపేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకటన, నోటిఫికేషన్ వచ్చిన తరువాత చంద్రబాబు, లోకేశ్ ప్రచారాలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనే భావనకు వచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి, బీదారవిచంద్ర, అమరనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: